Costly Elections: ఓటుకు 5-10 వేలు.. నియోజకవర్గానికి వందకోట్లు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర సృష్టిస్తాయా?
ఓటర్లారా జాగ్రత్త పడండి.. వాళ్లు ఇస్తున్నారు.. మేం తీసుకుంటున్నామని.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశం అని లెక్కలేసుకోకండి.. ఇచ్చే ఐదు వేలను ఐదేళ్లకు లెక్కేసి చూడండి.. రోజుకు రెండు రూపాయల భిక్ష వేసినట్లే మీకు!
ప్రాణంపోయినా పర్లేదు.. గెలవాల్సిన స్థానాలు కొన్ని ఉంటాయ్.. అక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఎవరూ చెప్పలేరని.. బిజినెస్‌మ్యాన్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారో.. ఓటర్ ఎటువైపు నిలుస్తారో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. మూడు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల వరద పారడం ఖాయం అనిపిస్తోంది. బైపోల్ విషయంలోనే రికార్డులు తిరగరాసిన చరిత్ర తెలంగాణ సొంతం. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నిక చూసి.. రాష్ట్రం అంతా బైపోల్ వస్తే బాగుండు అని జనం అనుకున్నారంటే.. అర్థం చేసుకోవచ్చు.. ఎంతలా నగదు పారిందో అక్కడ !
మరో ఎనిమిది నెలల్లో తెలంగాణలో ఎన్నికల జరగబోతున్నాయ్. దీంతో ఎలక్షన్ తీరు.. జరగబోయే ఖర్చు లెక్కలేస్తే కళ్లు తిరుగుతున్న పరిస్థితి. నియోజకవర్గానికి తక్కువలో తక్కువ వంద కోట్లు ఖర్చు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో నెక్ట్స్ అధికారం ఏ పార్టీది అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. బీజేపీ దూకుడు మీద ఉంది.. కాంగ్రెస్ నెమ్మది బౌన్స్‌బ్యాక్ అవుతోంది.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ప్రయత్నాల్లో ఉంది. ఇలాంటి పోటీ మధ్య.. ప్రతీ నియోజకవర్గంలోనూ గట్టి పోటీ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. గెలుపు కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు.. ఎంత అయినా ఖర్చు చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయ్. ఒక్క మునుగోడు జరిగిన ఉప ఎన్నికలోనే ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ 10 వేల చొప్పున ఇచ్చాయన్న ప్రచారం జరిగింది. అలాంటిది అధికారం జరగబోయే ఎన్నికలు.. ఐదేళ్లు పీఠం మీద కూర్చోబెట్టే ఎన్నికలు.. పైగా ఏ పార్టీకి నమ్మకం లేని ఎన్నికలు.. దీంతో ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో.. ఎవరి అంచనాలు వారు వేసుకోవాల్సిందే ! ఒక్కో ఓటుకు మినిమం ఐదు వేలు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధం అవుతున్నాయ్. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల వ్యయం విషయంలో గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం ఎంత తక్కువగా చూసుకున్నా వంద కోట్లకు పైమాటేనని అంటున్నారు.
వాస్తవంగా ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం నిబంధనల ప్రకారం 40లక్షల రూపాయలకు మించకూడదు. అన్ అఫిషియల్‌గా అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నారని ఓపెన్ సీక్రెటే ! ఓటర్లారా జాగ్రత్త పడండి.. వాళ్లు ఇస్తున్నారు.. మేం తీసుకుంటున్నామని.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశం అని లెక్కలేసుకోకండి.. ఇచ్చే ఐదు వేలను ఐదేళ్లకు లెక్కేసి చూడండి.. రోజుకు రెండు రూపాయల భిక్ష వేసినట్లే మీకు! వంద కోట్లు ఖర్చు చేసినా… వెయ్యి కోట్లు ఖర్చు చేసినా.. మళ్లీ మన నుంచే ముక్కుపిండి వసూలు చేస్తారు.. అది గుర్తుపెట్టుకోని ఓటేయండి.. ఓటుకు సిద్ధం కండి..