Telangana Elections : సీఎం కేసీఆర్ కు.. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండో బహిరంగ లేఖ

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి రెండో బహిరంగ లేఖ

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 12:08 PMLast Updated on: Nov 24, 2023 | 12:09 PM

Telangana Bjp State President Bandi Sanjays Second Open Letter To Telangana State Chief Minister

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి రెండో బహిరంగ లేఖ

అప్రజాస్వామికం మీ మనస్తత్వం!

ప్రజాస్వామ్యం తోకలేని పక్షిలా మారిందని ఎవరు అన్నారో గానీ.. దాని తోకల్ని, ఈకల్ని, రెక్కల్ని పీకేసి మీలాంటి నియంతలు వాటిని తమ మకుటాలకు అలంకరించుకుంటారు. ఉద్యమ నాయకుడిగా చెలామణీ అయి 2014లో అధికారంలోకి వచ్చాక ‘కేసీఆర్ ఎవరిమాటా వినడు’ అన్నట్లు తయారయ్యారు. ఉద్యమకాలంలో అన్ని పార్టీల గడపలు తొక్కినా మీరు.. అధికారం చేపట్టాక ఆ పార్టీల అస్తిత్వాలను తొక్కేసేలా వ్యవహరిస్తున్న విషయం వాస్తవం కాదా? ఉద్యమంలో ఉన్న రాజకీయ జేఏసీలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావంతులు, మేధావులను ఒక్కరొక్కరిగా దూరం పెట్టింది మీరు కాదా? ఈ విషయం తన కొంప మునిగేంతవరకు చాలామంది ఉద్యమకారులకు అర్థం కాలేదు. మీ ఆలోచన తెలిసిన వారికి ఇదేం కొత్త విషయం కాదు. మీతో కలిసున్న వారిలోనూ చాలా మందికి ఇప్పుడిప్పుడే మీ మనస్తత్వం పూర్తిగా బోధపడుతోంది.

ఈ మనస్తత్వం వెనక ఉన్నది మీలోని అహంకారం, మీ నియంతృత్వ ధోరణి. ‘అంతా నేనే’ అన్న హిరణ్యకశ్యపుని స్వభావం. మీ దృష్టిలో ప్రజలంటే మీరు చెప్పింది వినే అమాయకులు. మీ సమావేశాల్లో వారిని కసురుకునే స్వభావం చూస్తేనే అంతా అర్థమైపోతుంది. మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు చెప్పింది విని తలూపే ‘డూడూ బసవన్న’లు. టీవీలను, పత్రికలను 10 కిలోమీటర్ల లోతులో పాతి పెడతానన్న తర్వాత వాళ్లలో కొందరు మీకు వ్యతిరేకంగా రాయడం లేదు. ఉద్యమంలో నచ్చిన రాతలు ఆ తర్వాత పునరుద్ఘాటిస్తే.. మీరు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రజాసమస్యల గుండె చప్పుడుకు, తెలంగాణ గొంతుకకు, భావస్వేచ్ఛకు వేదికైన ధర్నాచౌక్‌ను మీరు ఎత్తేస్తారు. గొంతెత్తిన వారిని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి మీ దార్లోకి తెచ్చుకుంటారు. మీ మనసులో వచ్చేదే ‘రాష్ట్ర ప్రజలందరి ఆలోచన’, దాన్ని అమలు చేయడమే ‘రాష్ట్ర సంక్షేమం’ అని భావించే కొత్త తరహా నియంతృత్వ ప్రజాస్వామ్యమే మీ నేతృత్వంలో ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది.

ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రిని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? కలవాలో తెలియక జనం, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అయోమయం అవుతున్నారు. మిమ్మల్ని కలిశామని మీ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ ధైర్యంగా చెప్పగలరా? గతంలో ఎందరోమంది పాలకులు అమలు చేసిన ప్రజాదర్బార్ స్థానంలో అత్యద్భుతంగా ప్రగతి భవన్‌ను ఆధునిక నిజాం భవనంగా నిర్మించి, వందిమాగధుల పొగడ్తలతో.. ప్రజాభీష్టం తో పని లేకుండా మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం మరెవరికైనా సాధ్యమా?

అనవసర ప్రకటనలు చేస్తూ.. టైంపాస్ చేయడం మీకు అలవాటైపోయింది. దీనికితోడు పదేళ్లుగా.. అవినీతి, అక్రమాలు, అశ్రిత పక్షపాతంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారు. మీ పాలనలో ఎన్ని కుంభకోణాలు? ఎన్నెన్నో దౌర్జన్యాలు? ‘బంగారు తెలంగాణ’ పేరుతో మీరు చేస్తున్న పాలన.. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి పెద్ద లెందరో.. సచివాలయం, అసెంబ్లీ వంటివి ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని సంకల్పించారు. కానీ మీ దృష్టిలో దీనికి పూర్తి భిన్నమైన అర్థం ఉందని తెలంగాణ ప్రజలకు తెలిసేందుకు పదేళ్ల సమయం పట్టింది.

మీరెలాగూ సచివాలయానికి రారని తెలిసి.. అన్నిరకాల ఫైళ్లే ప్రగతి భవన్‌కు రావడమే మీ దృష్టిలో రాజ్యాంగం. ఇలాంటి నియంతృత్వ మనస్తత్వమే.. మీ రూపాన్ని యాదాద్రి దేవాలయ రాతిస్తంభాలపై చెక్కించుకునేంత వరకు వెళ్లింది. ప్రజాగ్రహానికి లొంగి మీరు వాటిని తొలగించాల్సి వచ్చింది లేదంటే.. ఆగమశాస్త్రపు చిత్రాలు కాకుండా మీ చిత్రాలు ఆలయంలో ఉండేవి.

స్పీకర్ దగ్గర జరిగే బీఏసీ (బిజి నెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాల్లో తప్ప అఖిలపక్షం నేతల ముఖాలు కూడా చూడటం మీకు ఇష్టముండదు. ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వనంత ‘ఇరుకైన’ ఆలోచనతో, పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న మీ అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారు.

భవదీయ

కిషన్ రెడ్డి