Telangana BRS Party: తెలంగాణలో సమరభేరికి సిద్దమైన కేసీఆర్.. సభలు, సమావేశాలు, నామినేషన్ల వివరాలివే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడమే తడవుగా సీఎం కేసీఆర్ రాజకీయ అస్త్రాలను సిద్దం చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం మొదలు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. వరుస సభలు, మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థులకు బీ ఫాంలు ఇలా ప్రతి ఒక్క అంశాంలో దూకుడుగా వ్యవహరించేందుకు సిద్దమయ్యారు. ఈనెల 15న తెలంగాణ భవన్ లో తొలుత పార్టీ అభ్యర్థులతో భేటీ కానున్నారు. గతంలో ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులనే దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం సాక్షిగా బరిలో దిగే నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఎన్నికల్లో పాటించాల్సిన రూల్స్ మొదలు నియోజకవర్గాల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫాం ఇచ్చి బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
హుస్నాబాద్ వేదికగా తొలి ఎన్నికల ప్రచారం..
తెలంగాణ భవన్ లో సమావేశం ముగించుకుని నేరుగా హుస్నాబాద్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని ప్రచారాన్ని ప్రారంభిస్తారు. గతంలో ఈ కార్యక్రమాన్ని వరంగల్ వేదికగా నిర్వహించాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈనెల 16న జరగాల్సిన వరంగల్ సభ రద్దయి హుస్నాబాద్ కు మారింది. హుస్నాబాద్ సభ మొదలు అనేక సభల్లో ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాల్గొని ప్రజలకు తాము చేసిన అభివృద్ది, సంక్షేమాల గురించి వివరిస్తారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన పురోగతి గురించి చెప్పి మరోసారి అధికారం ఇవ్వమని అడిగేలా ప్రణాళికలు రచించుకున్నారు.
కేసీఆర్ సభలు- సమావేశాలు ఇవే..
- అక్టోబర్ 15 తెలంగాణ పార్టీ భవన్ లో ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం.
- అక్టోబర్ 16 వరంగల్ సభ కొన్ని కారణాల దృష్ట్యా రద్దు.
- అక్టోబర్ 17 సిద్దిపేట, సిరిసిల్లలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
- అక్టోబర్ 18 మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల వేదికగా కేసీఆర్ ప్రసంగం.
- అక్టోబర్ 18 సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
- నవంబర్ 09 మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు.
కేసీఆర్ నామినేషన్ ఎప్పుడంటే..
కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. ఈ సారి ఎప్పుడు నామినేషన్ వేస్తారో కూడా పార్టీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది. ఉదయం గజ్వేల్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని అక్కడి నుంచి కామారెడ్డికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. ఈ ప్రక్రియ ముగించుకున్నాక మధ్యాహ్నం 3 గంటలకు అదే నియోజకవర్గంలోని భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
T.V.SRIKAR