Congress: జూలైలో టీకాంగ్ అభ్యర్థుల ప్రకటన.. భారీ సంచలనాలు చూడబోతున్నామా ?
తెలంగాణ రాజకీయం పీక్స్‌కు చేరింది. మూడు నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో.. కత్తులకు మించి పదును మీద కనిపిస్తున్నాయ్ రాజకీయ వ్యూహాలు. పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయ్.

Telangana Congress candidates are likely to be announced in July
అభ్యర్థుల ప్రకటన నుంచి జనాల మనసు గెలుచుకునే స్ట్రాటజీల వరకు పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నాయ్. ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే.. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్న కేసీఆర్.. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కూడా దాదాపుగా ఇలాంటి వ్యూహాన్నే అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. జూలై చివరినాటికి దాదాపు 70మంది అభ్యర్థులను ఖరారు చేయాలని హస్తం పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్వేలు నిర్వహించింది. గెలుపు గుర్రాలు ఎవరు అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చింది. సర్వే నివేదికల ఆధారంగా.. గెలుపు అవకాశం ఉన్న వారికే టికెట్లు కేటాయించబోతోంది కాంగ్రెస్. సీటు కోసం పోటీ తక్కువ ఉన్న నియోజకవర్గాలకు.. ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పోటీ ఎక్కువ ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కొంత ఆలస్యం అయ్యే చాన్స్ ఉంది. వారం రోజుల్లో ఎన్నికల సమన్వయ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా త్వరలో.. ఫైవ్ గ్యారంటీస్ ప్రకటన చేసే అవకాశముంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లను కూడా త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే రైతులు, నిరుద్యోగ యువత కోసం డిక్లరేషన్లు ప్రకటించారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ప్రియాంకగాంధీతో మహిళా డిక్లరేషన్ ప్రకటన చేయించేలా టీ కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయ్. వీటితో పాటు.. చేరికలకు ఆహ్వానం పలికేందుకు పార్టీ పెద్దలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి చేరిక ఖాయం అయింది. ఈ ఇద్దరితో పాటు.. పక్క పార్టీలో ఇబ్బంది పడుతున్న, అసంతృప్తిగా ఉన్న నేతలకు కాంగ్రెస్ గాలం వేయబోతోంది. ఇప్పటికే ఆ లిస్ట్ కూడా సిద్ధం అయినట్లు టాక్.