TELANGANA CONGRESS: హరీష్ రావు మైండ్ బ్లాక్ అయింది.. బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలు

రైతు బంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖలే కారణం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. హరీష్ రావు నోటి దూలవల్లే రైతు బంధును ఈసీ నిలిపివేసిందని కాంగ్రెస్ అంటోంది. ఇక.. కాంగ్రెస్ పేరుతో ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 04:09 PMLast Updated on: Nov 27, 2023 | 4:09 PM

Telangana Congress Condemn On Brs Fake Publicity Over Rythu Bandhu

TELANGANA CONGRESS: రైతు బంధు నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌.. ఈ అంశంపై పరస్పర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతు బంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖలే కారణం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. హరీష్ రావు నోటి దూలవల్లే రైతు బంధును ఈసీ నిలిపివేసిందని కాంగ్రెస్ అంటోంది. ఇక.. కాంగ్రెస్ పేరుతో ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు రాసిన లేఖ వల్లే రైతు బంధు నిలిచిపోయిందంటూ.. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉండటంతో రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు స్పందించారు. ఈ అంశంలో బీఆర్ఎస్ తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. రైతు బంధు ఆపాలని తాము ఎలాంటి లేఖ రాయలేదని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా దీనిపై స్పందించారు. “రైతు బంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో నేను రాసినట్టు ఫేక్ లేఖ సృష్టించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఓటమి భయంతో బీఆర్ఎస్ దిగజారి ఇలాంటి ఫేక్ ప్రచారాలకు పాల్పడుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజు, రాష్ట్ర డీజీపీని కోరుతున్నాను” అని రేవంత్ పేర్కొన్నారు.

హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగింది: నిరంజన్

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కూడా గాంధీ భవన్‌లో దీనిపై మాట్లాడారు. “ఎన్నికల కమిషన్.. రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ నియమ నిబంధనలు తెలిపింది. ఎన్నికల ప్రచారానికి రైతు బంధు వాడుకోవద్దని తెలిపింది. ఎన్నికల ప్రచారం ముగిసేలోపే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ చెప్పింది. దీంతో హరీష్ రావు మైండ్ బ్లాంక్ అయింది. రైతు బంధుని ఎన్నికల అస్త్రంగా వాడుకోవాలని చూశాడు. ఈ వీడియోని ఎన్నికల కమిషన్, సిఈవోకి పంపాం. మా లేఖలో ఎక్కడా రైతు బంధు ఆపాలని పేర్కొనలేదు. ఈ అంశంపై బీఆరెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎన్నికల కమిషన్‌కి రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టు తప్పుడు లెటర్ సృష్టించారు. మేము ఆ లెటర్‌పై సైబర్ క్రైమ్‌కి పిర్యాదు చేస్తున్నాం. హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధు ఉపసంహరించుకున్నామని ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొంది. రైతు బంధు విషయంలో కాంగ్రెస్‌పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు ఉపసంహారించుకోవాలి. 29న దీక్షా దివాస్ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 5 నుంచి నిశ్శబ్ద సమయం. మీరు దీక్షా దివస్ ఎలా చేస్తారు? ఆ మాత్రం అవగాహన కేటీఆర్‌కు లేదా..? కేసీఆర్ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల ఫలితాలకు నిదర్శనం. మా హామీలకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహిస్తుందని ఖర్గే తెలిపారు” అని నిరంజన్ అన్నారు.

కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం: మహేష్ కుమార్ గౌడ్

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. “రైతు బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై బీఆరెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి రాయకుండానే ఫేక్ లెటర్ సృష్టించి సర్క్యులెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా రైతులకి వ్యతిరేకంగా లెటర్ రాయడు. రైతు బంధుకి కాంగ్రెస్ ఏనాడు వ్యతిరేకం కాదు. ఫోర్జరీ లేఖ మీద తక్షణమే విచారణ చేపట్టాలి. క్రైమ్ డీసీపీని కలిసి బాద్యులపై చర్యలు తీసుకోవాలని కొరతాం. మేము రైతు బంధు అక్టోబర్‌లోనే వేయాలని చెప్పాం. ఎక్కడా ఆపమని చెప్పలేదు. రైతు బంధుపై బీజేపీ, బీఆరెస్‌లు నాటకం ఆడుతున్నాయి. రైతే రాజు అనే నినాదం కాంగ్రెస్‌దే. మేము రాగానే రైతు బంధు కింద రూ.15 వేలు ఇస్తాం. పీసీసీ ఉపాధ్యక్షులు రాసిన లేఖలో ఎక్కడా రైతు బంధు ఆపాలని చెప్పలేదు” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.