T-Congress:రేవంత్ మాటలకు విలువ లేదా.. కాంగ్రెస్ లో బీసీల పరిస్థితి ఏంటి..?

తెలంగాణలో బీసీల పరిస్థితి ఏంటి. ఏ పార్టీలోనూ ఈ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడంలేదా. మరి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2023 | 10:57 AMLast Updated on: Oct 03, 2023 | 10:57 AM

Telangana Congress Criticized For Not Allocating Suitable Mla Seats To Bc Leaders

తెలంగాణలో గత కొన్ని వారాలుగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయాలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని టీ కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శించారు. అందులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేందుకు ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. ప్రస్తుతం ఎక్కడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించడం లేదని భావిస్తున్నారు కొందరు ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు. దీంతో రేవంత్ రెడ్డిని కలుసుకొని తమ గోడు వినిపించారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఢిల్లీకి పయనమయ్యరు కొందరు సీనియర్ నేతలు. ఇందులో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు.

పార్టీకి రాజీనామా..

కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తోందని ముందుగానే గమనించి ఢిల్లీ కి చేరుకున్నారు సీనియర్ నాయకులు. కాంగ్రెస్ అధిష్టానం ముందు తమ గోడును విలపించి న్యాయం చేయమని అడిగేందుకు వేచిచూశారు. ఐదు రోజులు అవుతున్నా కాంగ్రెస్ పెద్దల నుంచి ఎలాంటి పిలుపు లభించలేదు. దీంతో స్పందన కరువై హైదరాబాద్ కి ఇద్దరు నేతలు తిరుగుపయనం అయ్యారు. అందులో డీసీపీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేరు బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నమ్ముకుని రాహూల్ గాంధీతో తిరిగినందుకు నాకు అన్యాయం చేశారంటూ తన బాధను వెల్లగక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. ఇదే పరిస్థితి ఇంకా ఎందరిలో ఉందో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ బీసీ ఓట్లను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ప్రత్యేక సమావేశం..

రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు విలువ లేకుండా పోయిందని భావిస్తున్నారు ఈ సామాజిక వర్గ నాయకులు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా 34 సీట్లను కేటాయిస్తామన్నారు. కానీ బీసీలు అంతకు మించి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పయనమయ్యారు. అయితే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పెద్దలు దీనిపై మరో విధంగా స్పందించారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన బీసీ ముఖ్య నేతలు హైదరాబాద్ లో సమావేశయై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల జాబితా వరకూ వేచి చూసి ఆతరువాత ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

రేవంత్ కొత్తరాగం..

గత పదేళ్లుగా అధికారం లేకపోయినా పార్టీని నమ్ముకుని నిలబడితే ఢిల్లీ పెద్దల తీరుపై మండిపడుతున్నారు బీసీ సామాజిక వర్గ నాయకులు. రాహూల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖార్గేలను కలిసి తమ పరిస్థితిని చెప్పుకునేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో మకాం వేసినప్పటికీ బీసీల టికెట్ల విషయంలో ఎలాంటి సమాచారం అందలేదు. పైగా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దీంతో పాటూ కొత్త రాగం అందుకున్నారు. బీసీలకంటే ఓసీలకే అధికంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలిందని చెబుతున్నారు. దీనిని బూచిగా చూపి బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయాలని చూస్తున్నట్లు కొత్త చర్చ జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటున్నారు. ఇలాగే జరిగితే కాంగ్రెస్ పరిస్థితి చాలా కష్టంగా మారుతుందని తెలుస్తోంది. హస్తం పార్టీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన వరకూ వేచి చూడాలి.

T.V.SRIKAR