T Congress: అభ్యర్థుల విషయంలో సెంచరీ కొట్టిన కాంగ్రెస్.. మిగిలిన 19 మందిపై నెలకొన్న ఉత్కంఠ

తెలంగాణలో కాంగ్రెస్ తాజాగా 45 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి సుమారు 100 స్థానాల్లో పోటీకి సిద్దమైంది. ఇక మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 28, 2023 | 01:17 PMLast Updated on: Oct 28, 2023 | 1:17 PM

Telangana Congress Has Announced 100 Mla Candidates But There Is Tension In The Remaining 19 Seats

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ కు గడువు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంలో దూకుడు పెంచింది. తాజాగా 45 మందిని ప్రకటించి సుమారు 100 స్థానాల్లో పోటీకి సిద్దమైంది. ఇక మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ కట్టబెట్టాలనే విషయంలో తర్జనబర్జన పడుతోంది. కొందరు కీలక నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే 100 స్థానాల్లోని అభ్యర్థులు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇలాంటి తరుణంలో ఈ 19 స్థానాలు కీలకంగా మారనున్నాయి. ఒకే స్థానం నుంచి ఇద్దరు అభ్యర్థుల టికెట్ విషయంలో పోటీ పడుతున్నారు. దీంతో హోరా హోరీ పోరునెలకొంది. కొందరిని కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తులను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారం కాస్త రాహూల్ గాంధీ వద్దకు చేరింది. దీంతో కొన్ని కీలక స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను తాను డిసైడ్ చేసేందుకు పావులు కదుపుతున్నారు.

ఎవరు ఎక్కడ పోటీ పడుతున్నారు..

  • అశ్వారావుపేట – తాటి వెంకటేశ్వర్లుతో పాటూ జారె ఆదినారాయణ పోటీలో ఉన్నారు
  • నారాయణ్ ఖేడ్ – సురేష్ షెట్కర్ బరిలో ఉండగా సంజీవ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు
  • సత్తుపల్లి – మట్టా రాగమయి, మానవతా రాయ్ మధ్య హోరా హోరీ నెలకొంది
  • ఇల్లందు – కోరం కనకయ్య, శంకర్ నాయక్, డాక్టర్ రవిల మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది
  • కరీంనగర్ – సంతోష్ కుమార్, పురుమల్ల శ్రీనివాస్, కొత్త జైపాల్ రెడ్డి కి మధ్య పోటీ నెలకొంది
  • పఠాన్ చెరువు – నీలం మధుకు కాట శ్రీనివాస్ గౌడ్ కి మధ్య టికెట్ల వ్యవహారం మంటరేపుతోంది.
  • జుక్కల్ – గంగారాం, తోట లక్ష్మీ కాంత రావుకు మధ్య టికెట్ల వ్యవహారం తేలడం లేదు
  • బాన్సువాడ – కాసుల బాలరాజు గౌడ్ తో పాటూ ఏనుగు రవీంద్రారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు
  • నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్, మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ పోటీలో ఉన్నారు
  • తుంగతుర్తి – అద్దంకి దయాకర్ కు డాక్టర్ వడ్డేపల్లి రవి కి మధ్య టికెట్ట గొడవ నెలకొంది
  • సూర్యాపేట – దామోదర్ రెడ్డికి పటేల్ రమేష్ రెడ్డి మధ్య టికెట్ రగడ నెలకొంది

ఇక్కడ కేవలం ఒకే పర్టీలో ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంలోనే ద్విముఖ, త్రిముఖ పోటీ కొనసాగుతోంది. వీరిలో అధిష్టానం ఎవరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుందో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడక తప్పదు. వీటితో పాటూ మిర్యాలగూడ, చెన్నూరు, వైరా, కొత్తగూడెంలో సీపీఐ నాయకులు బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే కేవలం ఒక్కరే టికెట్ ఆశించడం వారికి ఎవరు పోటీ లేకపోవడం గమనార్హం.

T.V.SRIKAR