Congress Party: రిపోర్ట్ ఇచ్చేసిన సునీల్ కనుగోలు.. నెక్ట్స్ ఏం జరుగుతుందంటే ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన పై అందరి దృష్టి సునీల్ పైనే ఉంది.
సునీల్ కనుగోలు.. ఇప్పుడు ఈ పేరును వినగానే కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ల ఆశావహ అభ్యర్థులంతా అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే.. సునీల్ ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగానే కాంగ్రెస్ నేషనల్ స్క్రీనింగ్ కమిటీ పార్టీ అభ్యర్థులను ఎలక్షన్ కోసం ఎంపిక చేయనుంది. తెలంగాణలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ అభ్యర్థులందరి ట్రాక్ రికార్డు, బలాలు, బలహీనతలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా కాంగ్రెస్ దిగ్గజ నేతలతో కూడిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఎదుట సునీల్ కనుగోలు ప్రజెంటేషన్ ఇస్తారు. దీంతో తమ గురించి అక్కడ ఎలాంటి చర్చ జరుగుతుందనే ఉత్కంఠ కాంగ్రెస్ టికెట్లను ఆశిస్తున్న నేతల్లో నెలకొంది. అభ్యర్థులపై, నియోజకవర్గాల రాజకీయ సమీకరణాలపై ఇటీవల నిర్వహించిన సర్వేలో వచ్చిన అంశాల ఆధారంగా సునీల్ కనుగోలు టీమ్ ఈ ప్రజెంటేషన్ ఇవ్వనుందని తెలుస్తోంది. దీని ఆధారంగా నిర్ణయం తీసుకునే హక్కు కేవలం ఏఐసీసీ నేతలకు మాత్రమే ఉంది.
ధీటైన అభ్యర్థులు ఎవరనే దానిపై..
సర్వే రిపోర్టును ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కు నాలుగు రోజుల క్రితమే సునీల్ అందించారని తెలుస్తోంది. సీల్డ్ కవర్‌లో ఉన్న ఆ సర్వే రిపోర్ట్ ను మురళీధరన్ ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇక రాష్ట్ర నేతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే, ప్రభావితం చేసే ఛాన్స్ లేదు. సునీల్ కనుగోలు నేరుగా ఏఐసీసీకి జవాబుదారీగా ఉండటంతో.. స్టేట్ లీడర్లు ఆయనతో టచ్ లోకి వెళ్లలేరు. ఫలితంగా బలమైన అభ్యర్థులనే కాంగ్రెస్ పెద్దలు బరిలోకి దింపుతారనే టాక్ వినిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ పోల్స్ లోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా సునీల్ పనిచేశారు. ఐదు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రకటించి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ముఖ్య పాత్ర పోషించారు. తెలంగాణలోనూ ఆయన రచించిన వ్యూహం ప్రకారమే ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించిన సునీల్ టీమ్, విపక్ష పార్టీల అభ్యర్థులను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థులెవరన్నది కాంగ్రెస్ పెద్దలకు వివరించారు.
ఒకటి, రెండు రోజుల్లో సమావేశమై..
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఒకటి రెండు రోజుల్లో సమావేశమై తమకు వచ్చిన సర్వే నివేదికలను పరిశీలించనున్నట్టు సమాచారం. ఇలా రెండు మూడు దఫాలు సమావేశమయ్యాక అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ప్రాధమిక అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసే సమయంలో పీసీసీ అధ్యక్షులను, పార్టీ శాసన సభా పక్షం నాయకులు, రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను హైదరాబాద్ వేదికగానే ప్రకటించే యోచనలో ఆ పార్టీ అధినాయకత్వం ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ సమావేశాల ముగింపు సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలా? లేక అదే రోజు సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయాలా ? అనే ప్రతిపాదనపై కాంగ్రెస్ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అగ్ర నాయకుల సమక్షంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా అసంతృప్తికి చెక్ పెట్టొచ్చనే భావనతో అధినాయకత్వం ఉందని అంటున్నారు.