Ponguleti Srinivas: పొంగులేటిని వదిలేదేలే అంటున్న బీజేపీ.. జగన్‌ను రంగంలోకి దింపబోతోందా ?

కర్ణాటక ఫలితాలు దేశవ్యాప్తంగా ఎలాంటి మార్పు తీసుకువచ్చాయో ఏమో కానీ.. తెలంగాణ మాత్రం గట్టిగా కనిపిస్తోంది ఆ ప్రభావం. కర్ణాటక ఫలితం.. బీజేపీ ఆశల మీద ఒకేసారి ట్యాంకర్‌ నీళ్లు చల్లింది. తెలంగాణలో తమదే అధికారం అని పదేపదే చెప్పిన బీజేపీ.. ఇప్పుడు అదే మాట అనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2023 | 01:54 PMLast Updated on: May 31, 2023 | 1:54 PM

Telangana Politics Around Ponguleti Srinivas

కాంగ్రెస్‌ తిరుగుబాటు నేతలు, బీఆర్ఎస్‌లో అసంతృప్త నాయకులంతా.. ఎన్నికల ముందు తమ పార్టీలో చేరుతారని లెక్కలు వేసుకున్న బీజేపీకి.. కర్ణాటక ఫలితాల తర్వాత సీన్‌ మొత్తం రివర్స్ అయింది. వచ్చేవాళ్లు రాకపోగా.. పార్టీలో ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఓ సంచలనం జరగాలి. కార్యకర్తల నుంచి నాయకుల వరకు.. అంతా ఒక్కటయ్యే ఒక్క చిన్న మూమెంట్ కావాలి. బలమైన నాయకుడు కాషాయం తీర్థం పుచ్చుకుంటునే అది సాధ్యం అవుతుంది. అందుకే పొంగులేటి విషయంలో బీజేపీ పట్టు మీద కనిపిస్తోంది. ఆయన పార్టీలో చేరితే.. ఖమ్మంలో బలం పెరగడమే కాదు.. పార్టీ శ్రేణుల్లోనూ స్థైర్యం నిండుతుందని లెక్కలేస్తోంది. అందుకే పొంగులేటిని వదులుకునేది లేదు అని ఫిక్స్ అయింది.

దీనికోసం ఎంతదూరం అయినా వెళ్లేందుకు.. ఎలాంటి అస్త్రం అయినా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పొంగులేటితో ఈ మధ్యే ఈటల భేటీ అయ్యారు. పొంగులేటి బీజేపీలో చేరడం కష్టమే అని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు ఈటల. పైగా బీజేపీలో ఏం చేస్తారు.. వచ్చేయండి కాంగ్రెస్‌కు వెళ్దామని పొంగులేటే ఈటలను రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు మరింత గందరగోళంలో పడ్డాయ్. ఈ కన్ఫ్యూజన్ క్లియర్‌ కావాలన్నా.. ఒకప్పటి జోష్‌ మళ్లీ పార్టీలో కనిపించాలన్నా.. పొంగులేటిని చేర్చుకోవడమే మార్గం అని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. దీనికోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు.. ఎంత అయినా తగ్గేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. పొంగులేటిని బీజేపీకి తీసుకువచ్చేందుకు బీజేపీ మాస్టర్‌ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

అదే ఏపీ సీఎం జగన్‌ను రంగంలోకి దింపడం. పొంగులేటికి, జగన్‌ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. నిజానికి పొంగులేటి ఎంపీగా గెలిచింది కూడా వైసీపీ నుంచే ! ఆ తర్వాత జగన్‌కు చెప్పే.. బీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్‌కు జగన్ చెప్పినా లాభం లేదనే.. గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అలాంటి అనుబంధం ఉన్న జగన్‌ను.. పొంగులేటి కోసం రంగంలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి, జగన్‌కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయ్. కేంద్రం ప్రతీ నిర్ణయానికి వైసీపీ, జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. బయటకు ఫ్రెండ్స్‌ కాదు కానీ.. అంతకుమించి బంధం ఉంది రెండు పార్టీల మధ్య ! అదే బంధాన్ని ఆయుధంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి బీజేపీలో చేరేలా ఒప్పించే బాధ్యతను జగన్‌కు బీజేపీ అప్పగించిందనే ప్రచారం సాగుతోంది.

ఖమ్మంలో బీజేపీకి బలం లేదన్న భావనలో ఉన్న పొంగులేటికి.. జగన్‌తో ధైర్యం చెప్పిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. బీజేపీలో రాజకీయంగా మంచి భవిష్యత్‌కు తాను భరోసాగా ఉంటానని జగన్‌తో హామీ ఇప్పించేలా ప్లాన్ చేస్తున్నారట బీజేపీ నేతలు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అటు ఇటు అయితే.. ఏపీ నుంచి రాజ్యసభకు పంపించేందుకు కూడా సిద్ధం అని జగన్ హామీలు ఇస్తున్నారట. ఈ ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇది నిజమా.. జగన్‌ నిజంగానే పొంగులేటితో మాట్లాడారా.. కన్విన్స్ అవుతారా.. బీజేపీలో చేరుతారా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి మరి.