Telangana Secretariat: వాయిదాపడ్డ సచివాలయ ప్రారంభోత్సవం

TELANGANA SECRETARIAT INAGURAION POSTPONE
తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భారీ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటూ అద్భుతమైన రూపాన్ని తీసుకొచ్చింది. ఈనెల 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దీని ప్రారంభోత్సవాన్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వెలువడ్డ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా దీని రిబ్బన్ కటింగ్ ను వాయిదా వేసింది తెలంగాణ సర్కార్. నిజానికి ఈ ఏడాది జనవరి 18న ప్రారంభించాల్సి ఉంది. అయితే కొన్ని తుదిమెరుపులు దిద్దే పనుల కారణంగా ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. ప్రస్తుతం వాయిదా పడ్డ విషయాన్ని మాత్రమే చెబుతున్నారు. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
నూతన సచివాలయ ప్రత్యేకత:
జూన్ 27, 2019న నూతన తెలంగాణా సచివాలయ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. నాలుగు సంవత్సరాల్లో 28 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనాలతో గాలి, వెలుతురు వచ్చేలా దీని నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. దీనిని రూ. 610కోట్ల రూపాయలతో పునర్నిర్మిస్తున్నారు. తాజ్ మహల్ ఎత్తు 240 అడుగులు కాగా.. కుతుబ్ మినార్ ఎత్తు 237 అడుగులు ఉంది. చార్మినార్ ఎత్తు 183 అడుగులు అయితే ఈ నూతన సెక్రటెరియేట్ ఎత్తు 265 అడుగులు కాగా దీనిపై ఎగురవేసే జాతీయ జెండాను కలుపుకుంటే వీటన్నింటినీ అధిగమిస్తూ సుమారు 278 అడుగులతో దేశంలోనే ఎత్తైన కట్టడంగా దీనిని నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేకమైన ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు. రాజస్తాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెడ్ స్టోన్ ను ఇందులో ఉపయోగించారు. బయట నుంచి చూడటానికి 11 అంతస్తులతో కనిపిస్తున్నప్పటికీ మొత్తం ఆరు అంతస్తులతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. 6వ అంతస్తులో సీఎం కేసీఆర్ ఛాంబర్ ను తూర్పు ముఖంగా నిర్మించారు. ఒక్కో అంతస్తు ఎత్తు 14 అడుగులు ఉంటుంది. దీనిపై ఏర్పాటు చేసిన డ్రోమ్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును దీనికి పెట్టాలని ప్రతిపాదించారు.