Keeravani : వివాదంలో తెలంగాణ రాష్ట్ర గీతం

అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ...’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2024 | 11:08 AMLast Updated on: May 26, 2024 | 11:08 AM

Telangana State Anthem In Controversy

అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందెశ్రీ రచించిన ఆ గీతానికి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించకపోవడాన్ని ప్రస్తావించడమే కాదు, ప్రస్తుత ప్రభుత్వం ఆ గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి అప్పగించడంపై అసోసియేషన్‌ తమ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన ప్రకటన సారాంశం ఇలా ఉంది.

‘అందెశ్రీగారు రచించిన ‘జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది. పదేళ్ల క్రితమే ఈ గీతాన్ని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేది. అలా జరగకపోవడం దురదృష్టకరం. గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైంది. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయింది. మళ్ళీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు.

అన్నీ బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణి గారిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని మీకు తెలియజేస్తున్నాము. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియనిది కాదు. తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైందో మీకు తెలియనిది కాదు. ‘మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి’ అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ పాటకి సంగీతాన్ని అందించడమేంటి.. అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ కళాకారులుగా కోరుతున్నాము.ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు. మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే… ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే గీతంలా గౌరవింపబడుతుందనేది మా అభిప్రాయం. ఇది మా సలహా మాత్రమే. ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటూ…. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌.