ప్రపంచ క్రికెట్లో 2024లో తెలుగు యువ ఆటగాళ్లు తమ ముద్ర వేశారు. గుంటూరు నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన తిలక్ వర్మ టి20 క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. మరో యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి సంచలనాలు నమోదు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఇద్దరు దుమ్ము రేపారు. దీంతో జాతీయ జట్టులోకి ఎంపికైన ఈ ఇద్దరు ఇప్పుడు భారత క్రికెట్ టీంలో కీలక ఆటగాళ్లగా ఎదుగుతున్నారు. టీ20లలో వర్మ వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో జట్టుకు విలువైన పరుగులు చేసి తనపై కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం ఎదురుచూస్తున్న గౌతమ్ గంభీర్ కు నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో మంచి ఆటగాడు దొరికినట్టుగానే కనబడుతోంది. దీనితో ఈ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి పై భారత క్రికెట్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మంచి టెక్నిక్ తో బ్యాటింగ్ చేయడమే కాకుండా అవసరమైన సమయంలో పవర్ హిట్టింగ్ చేస్తూ పరుగులు రాబడుతున్నాడు. ఇక బౌలింగ్ లో కూడా పరవాలేదు అనిపించాడు నితీష్ కుమార్ రెడ్డి. సీనియర్ ఆటగాళ్లు ఉన్నా సరే వాళ్ళని పక్కనపెట్టి నితీష్ కుమార్ రెడ్డి మీద నమ్మకంతో తీసుకోవడం అతను మెరుగ్గా రాణించడం అనేది మంచి సంకేతంగా చెప్పాలి. ఇక తిలక్ వర్మ కూడా టీ20లలో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి వరుసగా రెండు సెంచరీలు చేయడంతో ఆ స్థానంలో అతను దాదాపుగా ఖాయం అయినట్టుగానే తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో తుదిజట్టులో అతనిని కంటిన్యూ చేసేందుకు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సానుకూలంగా ఉన్నాడు. అటు సెలెక్టర్లు కూడా అతనిపై మంచి నమ్మకాన్ని ఉంచుతున్నారు. దీనితో టి20ల లో అతను కీలకంగా మారే అవకాశం కూడా ఉండవచ్చు. ఒకప్పుడు తెలుగు ఆటగాళ్లు భారత జట్టుకు ప్రాతినిధ్య వహించాలి అంటే చాలా కష్టంగా మారేది. అసలు తుది జట్టులో స్థానం కోసం చాలా పోరాటం చేసిన పరిస్థితి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ఏకంగా ఇద్దరు ఆటగాళ్లు వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్ లో దుమ్ము రేపటంతో భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు మంచి జోష్లో ఉన్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ టీమిండియాలో కచ్చితంగా కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం టీమిండియా కు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లోటు ఉండటంతో నితీష్ కుమార్ రెడ్డి ఇదే ప్రదర్శన కొనసాగిస్తే రాబోయే మ్యాచ్ లలో కీలకంగా ఆడితే వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో అలాగే ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అతను ఎంపిక అయ్యే అవకాశం ఉండవచ్చు. ఇక తిలక్ వర్మ కూడా ఛాంపియన్ ట్రోఫీలో ఆడే అవకాశం ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సీనియర్ ఆటగాళ్లు క్రమంగా రిటైర్ అవుతున్న నేపథ్యంలో వీరిని తుది జట్టులోకి కొనసాగించడం లాంచనంగానే ఉంది.[embed]https://www.youtube.com/watch?v=2-3a6UbhcVM[/embed]