ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్, నామినేషన్స్ లో తెలుగమ్మాయి
అండర్ 19 ప్రపంచకప్ లో దుమ్మురేపిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. జనవరి నెలకు సంబంధించి మహిళల క్రికెట్ లో ముగ్గురు నామినేటవగా... అందులో త్రిష కూడా ఉంది.

అండర్ 19 ప్రపంచకప్ లో దుమ్మురేపిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. జనవరి నెలకు సంబంధించి మహిళల క్రికెట్ లో ముగ్గురు నామినేటవగా… అందులో త్రిష కూడా ఉంది. ఇద్దరు సీనియర్ క్రికెటర్లతో గొంగడి త్రిష పోటీ పడుతోంది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెత్ మూనీ, విండీస్ స్పిన్నర్ కరీష్మాతో పాటు త్రిష నామినేట్ అయింది. ఈ టీమిండియా యువ సంచలనం ఇటీవల ముగిసిన అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ టోర్నీకి సంబంధించి జనవరిలో జరిగిన మ్యాచ్ లలో త్రిష 265 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన త్రిష.. టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనతోనే ఆమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది.
2023 అండర్ 19 ప్రపంచకప్ లోనూ ఆడిన త్రిష ఈ సారి భారత్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది. భద్రచలంకు చెందిన గొంగడి త్రిష 12 ఏళ్ళకే అండర్ 19 క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 16 ఏళ్ళకే సీనియర్ టోర్నీలో ఆడింది. కాగా ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. మరోవైపు ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచింది. మూనీ యాషెస్ సిరీస్‌లో సత్తా చాటింది. టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లో మూనీ 213 పరుగులు చేసింది. ఈ ప్రదర్శనతోనే టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళింది. అలాగే విండీస్ స్పిన్ బౌలర్ కరిష్మ రామ్హరాక్ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటడంతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కరిష్మ రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసింది.