ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ పుజారా,నితీశ్ లకు చోటు ?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో ఈ సారి టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది. దీని కోసం వచ్చే నెలలో ఆస్ట్రేలియాకు వెళ్ళనున్న భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కంగారూలకు వారి సొంతగడ్డపైనే షాకిచ్చి సిరీస్ లు గెలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2024 | 06:54 PMLast Updated on: Oct 23, 2024 | 6:54 PM

Test Series Against Australia A Place For Pujara And Nitish

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో ఈ సారి టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది. దీని కోసం వచ్చే నెలలో ఆస్ట్రేలియాకు వెళ్ళనున్న భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కంగారూలకు వారి సొంతగడ్డపైనే షాకిచ్చి సిరీస్ లు గెలిచింది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ టూర్ కోసం భారత జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అక్టోబర్ 28న సమావేశమై జట్టును ఎంపిక చేయనుంది. ఈ సారి సీనియర్ క్రికెటర్లతో పాటు పలువురు యువ ఆటగాళ్ళు ఎంపికవడం ఖాయమని చెప్పొచ్చు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్టుకు తాను అందుబాటులో ఉండనంటూ ఇటీవలే రోహిత్ బీసీసీఐ చెప్పినట్టు సమాచారం. దీంతో తాత్కాలిక కెప్టెన్ ను కూడా బీసీసీఐ ఎంపిక చేయనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో సిరీస్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న జస్ప్రీత్ బూమ్రానే తొలి టెస్టులో సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం న్యూజిలాండ్ తో సిరీస్ లో ఆడుతున్న జట్టులో చాలా మంది ఆసీస్ టూర్ కు ఎంపికవడం లాంఛనమే. అదే సమయంలో కొన్ని అనూహ్యమైన ఎంపికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వెటరన్ బ్యాటర్ చటేశ్వర పుజారా మళ్ళీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కౌంటీ క్రికెట్ తో పాటు తాజాగా రంజీ సీజన్ లోనూ పుజారా పరుగుల వరద పారిస్తున్నాడు. ఛత్తీస్ ఘడ్ తో మ్యాచ్ లో డబుల్ సెంచరీతో అదరగొట్టి సెలక్టర్లకు తన ఫామ్ మరోసారి గుర్తు చేశాడు. పైగా కంగారూ గడ్డపై పుజారాకు తిరుగులేని రికార్డుంది. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేసిన పలు సందర్భాల్లో ఆసీస్ పేసర్లను ఎదుర్కొని జట్టును ఆదుకున్నాడు. 2018-19 టూర్ లో 521 పరుగులు, 2020-21 టూర్ లో 271 పరుగులు చేశాడు. ఆసీస్ పేస్ పిచ్ లపై పుజారా అవసరం ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్న సెలక్టర్లు అతనికి చివరి అవకాశం ఇవ్వొచ్చు.

ఇదిలా ఉంటే ఈ టూర్ కు భారత పేస్ ఎటాక్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ పేసర్ బూమ్రా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తో పాటు ఆకాశ్ దీప్ ఎంపిక లాంఛనమే. మహ్మద్ షమీ ఫిట్ నెస్ సాధించడంపైనే అతని ఎంపిక ఆధారపడి ఉంటుంది. అయితే మిగిలిన పేసర్లుగా పలువురు పోటీలో ఉన్నారు. అవేశ్ ఖాన్, యశ్ దయాల్ , ప్రసిద్ధ కృష్ణ, మయాంక్ యాదవ్, శార్థూల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరిని జట్టుతో పాటు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్స్ గా కొనసాగించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇక సీమ్ ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికవుతాడని భావిస్తున్నారు. ఐపీఎల్ తో పాటు బంగ్లాదేశ్ సిరీస్ లో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ఆసీస్ లో పర్యటించే భారత్ ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ సిరీస్ లో అతని ప్రదర్శన ఆధారంగా సీనియర్ జట్టులోకి తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఆంధ్రా క్రికెటర్ ను పూర్తిస్థాయి ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కోచ్ గంభీర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.