TG replaces TS: నేటి నుంచి టీఎస్ కాదు.. టీజీ.. కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం

శుక్రవారం నుంచి వాహనాలు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్‌ అవుతాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ టీజీ అనే రాసుకున్నారని పొన్నం గుర్తు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 01:56 PMLast Updated on: Mar 15, 2024 | 1:56 PM

Tg Replaces Ts As State Code In Telangana Vehicle Registration Plates Centre Gives Nod

TG replaces TS: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్లు.. శుక్రవారం నుంచి టీజీ పేరుతో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలోని నూతన వాహనాలకు టీఎస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీఎస్ కోడ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌.. టీఎస్‌ను టీజీగా మారుస్తామని చెప్పింది. దీనికి తగ్గట్లే శుక్రవారం నుంచి వాహనాలు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్‌ అవుతాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ టీజీ అనే రాసుకున్నారని పొన్నం గుర్తు చేశారు.

Pithapuram Issue: అసమ్మతి సెగ.. పవన్‌కు పిఠాపురం సీటు.. రచ్చ.. రచ్చ..

కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఎస్ పేరుతో రిజిష్ట్రేషన్లు చేశారని పొన్నం ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు అనుగుణంగా టీఎస్‌ను టీజీగా మార్చాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశంపై కేంద్రానికి లేఖ కూడా పంపించామన్నారు. శుక్రవారం ఉదయం నుంచి టీజీ పేరుతో వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతున్నప్పటికీ.. పాత వాహనదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు రిజిస్టర్‌ అయిన వాహనాల నంబర్లు అలాగే ఉంటాయని మంత్రి చెప్పారు. అయితే, శుక్రవారం నుంచి తెలంగాణలో మూడు సిరీస్‌ల వాహనాలు ఎక్కువగా కనిపించబోతున్నాయి. ఉమ్మడి ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు ఏపీ కోడ్, తెలంగాణ వచ్చాక టీఎస్ కోడ్, కాంగ్రెస్ వచ్చాక టీజీ కోడ్‌ కలిగిన వాహనాలు కనిపిస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్‌తో, 98,10,321 వాహనాలు టీఎస్‌ సిరీస్‌తో ఉన్నాయి.

కొత్త వాహనాలకు టీజీ సిరీస్ ఒక్కటే మారుతుంది. జిల్లా సిరీస్‌లు, ఇతర సిరీస్‌లు అలాగే కొనసాగుతాయి. టీజీ జెడ్‌.. ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ.. పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి. కాగా.. డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను కఠిన తరం చేస్తున్నామన్నారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు కూడా ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహించాలనే నిబంధనలను తీసుకువచ్చినట్లు చెప్పారు. టీఎస్‌ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి కొత్తబస్సులు తెచ్చామని, త్వరలోనే మరో వెయ్యి బస్సులు తీసుకొస్తామని తెలిపారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.