శివపార్వతుల నివాసం – మానససరోవరం
సృష్టికర్త బ్రహ్మ ఉండేది బ్రహ్మలోకం, విష్ణువు కొలువైంది వైకుంఠం, ముక్కంటి శివుడు నివాసం కైలాసం. ఆ కైలాసం భూమిపైనే ఉందా? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా? భూమిపై శివుడి ఉనికి నిజమేనా? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా? అన్నింటికీ సమాధానమే మానససరోవరంలోని కైలాస పర్వతం.
సృష్టికర్త బ్రహ్మ ఉండేది బ్రహ్మలోకం, విష్ణువు కొలువైంది వైకుంఠం, ముక్కంటి శివుడు నివాసం కైలాసం. ఆ కైలాసం భూమిపైనే ఉందా? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా? భూమిపై శివుడి ఉనికి నిజమేనా? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా? అన్నింటికీ సమాధానమే మానససరోవరంలోని కైలాస పర్వతం.
కైలాస పర్వతం… శివపార్వతుల నివాసంగా పరిగణించబడుతుంది. కైలాస పర్వత దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. పరమశివుని అనుమతి ఉన్నవారికే… కైలాస పర్వత దర్శనం కలుగుతుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తాడు. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఈ భూమిపై అత్యంత కష్టమైన, సాహసోపేతమైన యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, ఎటుచూసినా కనిపించే పర్వతాలు, చుట్టూ పెద్దపెద్ద లోయలు.. ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఇవే ప్రత్యేక ఆకర్షణలు కూడా. ఈ సాహసోపేతమైన యాత్రను… మహాశివుడి ఆశీస్సులు ఉన్నవారు మాత్రమే విజయవంతంగా పూర్తిచేస్తారని పురాణాలు చెప్తున్నాయి.
కైలాస పర్వతం ఒక్కొక్క సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంది. వెండికొండగా, బంగారు పర్వతంగా, ఇలా రకరకాల ఆకారాలలో ఇది కనిపిస్తుంది. ఇదంతా సాక్షాత్తు ఆ మహాదేవుడి లీలగా చెప్తారు భక్తులు. కైలాస పర్వత శిఖరం శివలింగంలా కనిపిస్తుంది. ఏడాది పొడవునా తెల్లటి మంచుతో కప్పబడి ఉంటుంది. దీనికి ఆనుకుని ఉన్న మానస సరోవరాన్ని కైలాష్ మానస సరోవరం అంటారు. ఈ పర్వతాన్ని స్వయంభువుగా భావిస్తారు. ఈ అద్భుతమైన, అతీంద్రియ ప్రదేశంలో కాంతి తరంగాలు, ధ్వని తరంగాల సంగమం ఉంటుందని.. అందుకే ఆ ప్రాంతమంతా ఓంకార నాదం ప్రతిధ్వనిస్తుందని అంటారు.
కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు నిలువుటద్దం ఈ సరస్సు. విపరీతమైన మంచు ఉన్నా… ఈ సరస్సు నీటిమట్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇది శివుని అనుగ్రహం వల్ల సాధ్యమని హిందువుల విశ్వాసం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ సరస్సును సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. తెల్లవారుజామున 3గంటల నుంచి 5 గంటల మధ్య… బ్రహ్మ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం కూడా ఇక్కడికి వచ్చిన చాలా మందికి చూశారట. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గుహల్లో మునులు, సాధకులు, రుషులు కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటూ ఉంటారట.
మానస సరోవరం సరస్సు మట్టిని తాకితే చాలు… బ్రహ్మ సృష్టించిన స్వర్గానికి చేరుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. సరస్సులోని నీటిని తాగిన వ్యక్తి శివుడు సృష్టించిన స్వర్గానికి చేరుకుంటారని కూడా నమ్ముతున్నారు. పట్టాభిషేకం తర్వాత రామ-లక్ష్మణులు, చివరి దశలో పాండవులు… కైలాస పర్వత యాత్ర చేసారని మన మత గ్రంథాలు చెప్తున్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.