కోహ్లీ అడ్డా అడిలైడ్, ఆసీస్ కు కంగారు షురూ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియా ఇప్పుడు సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. అడిలైడ్ వేదికగా జరగబోయే పింక్ బాల్ టెస్టులో భారత్ ను ఓడించేందుకు నెట్స్ లో చెమటోడ్చుతోంది. అయితే ఆసీస్ కు విరాట్ కోహ్లీని చూసి కంగారు మొదలైంది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియా ఇప్పుడు సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. అడిలైడ్ వేదికగా జరగబోయే పింక్ బాల్ టెస్టులో భారత్ ను ఓడించేందుకు నెట్స్ లో చెమటోడ్చుతోంది. అయితే ఆసీస్ కు విరాట్ కోహ్లీని చూసి కంగారు మొదలైంది. ఈ సిరీస్ ముందు వరకూ పేలవ ఫామ్ తో సతమతమైన కోహ్లీ పెర్త్ లో శతక్కొట్టాడు. తమకెంతగానో ఇష్టమైన ఆసీస్ పిచ్ లపై ఫామ్ అందుకుని భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ కెరీర్ లో 81వ శతకం సాధించిన విరాట్ ఇదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం కంగారూలకు చుక్కలే.. ఎందుకంటే నయా కింగ్ జైశ్వాల్ ఇప్పటికే దుమ్మురేపుతుంటే విరాట్ కూడా అతనికి జతకలిస్తే ఇక సిరీస్ లో భారత్ ను అడ్డుకోవడం ఆసీస్ కు కష్టమనే చెప్పాలి. అందుకే ఎట్టిపరిస్థితుల్లో కోహ్లీ ఫామ్ కంటిన్యూ చేయకూడదని కోరుకుంటోంది.
పైగా అడిలైడ్ గ్రౌండ్ కోహ్లీకి బాగా అచ్చొచ్చిన వేదిక… ఇదే గ్రౌండ్ లో విరాట్ కు తిరుగులేని రికార్డుంది. 2014-15 సీజన్ లో పలు భారీస్కోర్లు సాధించాడు. పటిష్టమైన ఆసీస్ పేస్ ఎటాక్ ను ఎదుర్కొని మూడు శతకాలు బాదేశాడు. ఓవరాల్ గా అడిలైడ్ లో కోహ్లీ 73 సగటుతో 957 పరుగులు చేశాడు. దీనిలో ఐదు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసిన తర్వాత కంగారూలకు మరింత టెన్షన్ మొదలైంది. అసలే ఫామ్ లోకి వచ్చిన కోహ్లీని బాగా కలిసొచ్చిన అడిలైడ్ లో ఎలా ఆపాలనేది వాళ్ళకు తలనొప్పిగా మారింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అడిలైడ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ల కంటే కోహ్లీనే అత్యధిక పరుగులు చేశాడు. స్మిత్, గ్రెగ్ ఛాపెల్, షేన్ వాట్సన్, గిల్ క్రిస్ట్ వంటి ఆటగాళ్ళను డామినేట్ చేస్తూ ఈ గ్రౌండ్ లో విరాట్ తనదైన ముద్ర వేశాడు. సాధారణంగా ఆసీస్ పిచ్ లపై పరుగులు చేయడం అంత సులభం కాదు. అలాంటి కంగారూలకు సైతం సాధ్యంకాని రీతిలో పరుగుల వరద పారించిన కోహ్లీ మరోసారి భారత్ కు ఈ సిరీస్ లో కీలకమయ్యాడు.
కాగా ఈ మ్యాచ్ కు ముందు పలు రికార్డులు కోహ్లీని ఊరిస్తున్నాయి. అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే.. దిగ్గజ క్రికెటర్ బ్రాడ్‌మన్ రికార్డ్ సమం అవుతుంది. ఒక అంతర్జాతీయ జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డ్‌లో ప్రస్తుతం బ్రాడ్‌మన్ 11 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ 10 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై బ్రాడ్‌మన్ 11 సెంచరీలు నమోదు చేయగా.. ఆస్ట్రేలియాపై కోహ్లీ 10 సెంచరీలు చేశాడు. ఈ రికార్డ్‌లో సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకపై సచిన్ 9 సెంచరీలు నమోదు చేశాడు.