BJP: సీబీఐ, ఈడీ..ఇప్పుడు ఈసీ.. ఇక బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాట

బీజేపీ అధికార ప్రతినిధిగా ఉంటూ కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన మీనాక్షి లేఖి మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సభ్యులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఈడీనే కాదు సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కాషాయ దళానికి ఊడిగం చేస్తున్నాయని , తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ వాటిని వాడుకుంటోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2023 | 07:16 AMLast Updated on: Aug 13, 2023 | 7:16 AM

The Bjp Keeps The Power In Its Hands And Manipulates The Central Governments Investigative Agencies Which Are Supposed To Be Independent

నోరు మూసుకుని కూర్చోండి.. లేదంటే మీ ఇంటికి ఈడీ వస్తుంది.. నేరుగా పార్లమెంట్‌లో ఓ కేంద్రమంత్రి విపక్ష సభ్యులను ఉద్దేశించి ఈ మాటల అనగలిగారంటే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థను కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మలా చేసుకుని ఆడిస్తుందని చెప్పడానికి ఇంకేమైనా ఆధారాలు కావాలా. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉంటూ కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన మీనాక్షి లేఖి మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సభ్యులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఈడీనే కాదు సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కాషాయ దళానికి ఊడిగం చేస్తున్నాయని , తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ వాటిని వాడుకుంటోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలకు పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదంగా చూడాలి.

ఆడేది ఎవరు, ఆడించేది ఎవరు అంతా మిధ్యా..అని అనుకుంటాం గానీ.. ఆడేది.. ఆడించేది అంతా విశ్వ గురువు గారే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ , వన్ నేషన్ వన్ పాలసీ , వన్ నేషన్ వన్ టాక్స్ ఇలాంటి విధానాలను కోరుకుంటున్న ప్రధానమంత్రి మోడీ వన్ నేషన్ వన్ పార్టీ ఉండాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ కాషాయ జెండా మాత్రమే రెపరెపలాడాలని.. తాను మాత్రమే పీఎంగా ఉండాలన్నది ఆయన అభిమతం. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని అందుకున్నది కూడా అందుకే. అందులో భాగంగానే వ్యవస్థలన్నింటినీ తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలు దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల కోసం లోక్‌సభ ముందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లు తీరును చూస్తుంటే.. రాజ్యాంగబద్దంగా , సర్వస్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి గులాంగిరీ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసీ సభ్యుల నియామకాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా, ఎలక్షన్ కమిషనర్లుగా నియమించుకునే కుట్రలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశించినట్టు నియామకాలు చేపడితే.. నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాగస్వామి కావాలి. కానీ ఇందులో సీజేఐ పాత్ర లేకుండా ఉండేందుకు తమ ఆలోచనలను ఎవరూ ప్రశ్నించే పరిస్థితులు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. నియామక కమిటీలో ప్రధానమంత్రి, విపక్ష నేత, సుప్రీం సీజేఐ సభ్యులుగా ఉండాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే.. వాటిని బేఖాతరు చేస్తూ.. ప్రధాని, విపక్షనేతతో పాటు సీజేఐ స్థానంలోకి ఓ కేంద్ర మంత్రిని ప్రతిపాదించారు. ఇక్కడే బీజేపీ ఆడుతున్న రాజకీయం అర్థమవుతుంది. ముగ్గురు సభ్యులు పీఎం, కేంద్రమంత్రి అధికార పార్టీకి చెందిన వాళ్లే. ఇక ప్రతిపక్షానికి చెందిన ఒక్క సభ్యుడి మాటకు విలువ ఉంటుందా. కచ్చితంగా ఉండదు. ఏదో నామ్ కే వాస్తే సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి సభ్యులను ఎంపిక చేసి.. నియామక కమిటీని నామమాత్రంగా నిర్వహించి.. అంతా నిబంధనల ప్రకారం చేస్తున్నామని చెప్పుకుంటారు తప్ప..ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాయంలో ఎవరు కూర్చోవాలో బీజేపీనో, ఆర్ఎస్ఎస్సో ముందో డిసైడ్ చేసేస్తాయి.

ఇప్పటి వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ప్రోటోకాల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంది. కేంద్రం కొత్తగా తెచ్చిన బిల్లులో సీఈసీ స్థాయిని కేబినెట్ సెక్రటరీ స్థాయికి తగ్గించేశారు. అంటే ఒక కేంద్ర మంత్రి స్థాయి కూడా సీఈసీకి ఉండదు. దీంతో ఎన్నికల నిర్వహణ సమయంలో ఎవరినైనా ప్రశ్నించే అధికారం ఉన్న ఎన్నికల సంఘం..ఇకపై ఆ స్థాయిని కోల్పోతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా నుంచి కేబనెట్ సెక్రటరీ స్థాయికి తగ్గించడం ద్వారా కేంద్రం ఆ పని చేయగలిగింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే బీజేపీ ఐటీ సెల్ నుంచి ట్విట్టర్ ద్వారా షెడ్యూల్ లీక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. గులాంగిరి చేయడానికి ఇష్టపడని టీఎన్ శేషన్ వంటి యోధులు ఎన్నికల సంస్కరణను తీసుకొచ్చి.. రాజకీయ పార్టీలకు చుక్కలు చూపిస్తే.. ఇప్పుడు ఎన్నికల సంఘమే కేంద్రంలోని అధికార పార్టీకి సలామ్ చేసే పరిస్థితులు వచ్చాయి.

ఎలాంటి లిఖిత రాజ్యాంగం లేని ఇజ్రాయెల్ ఇటీవల సుప్రీంకోర్టు అధికారాలకు కత్తెర వేస్తూ ఆదేశ పార్లమెంట్ లో ఓ చట్టాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాలను సుప్రీంకోర్టు ప్రశ్నించకూడదు. చట్టాలను రద్దు చేసే అధికారం కూడా సుప్రీంకు ఉండదు. ఇప్పుడు మనదేశంలో కూడా పరిస్థితులు ఇంచుమించు అలానే కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడాలంటే ఎన్నికల సంఘం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా..స్వతంత్రంగా వ్యవహరించాలి. కానీ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు కారణంగా ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందన్న నమ్మకం ప్రజలకు గానీ, విపక్షాలకు గానీ లేకుండా పోయింది. రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐని, ఈడీని ఉసిగొల్పుతూ.. వాటిని తమ జేబు సంస్థలుగా మార్చేసుకున్న బీజేపీ ఇకపై ఎన్నికల సంఘాన్ని కూడా అలాగే ఆడించబోతోంది. ఎన్నికలను , ఎన్నికల వ్యవస్థను మానిపులేట్ చేస్తే ప్రజాస్వామ్యానికి అంతకు మించిన ఉపద్రవం మరొకటి ఉండదు.