BRS Party Logo: కారు గుర్తు విషయంలో ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పార్టీలు తమతమ కార్యాచరణను ప్రకటించుకుని ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ తన కారు గుర్తు విషయంలో ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది.
దేశ వ్యాప్తంగా ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక పార్టీ గుర్తును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయిస్తూ ఉంటారు. దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నికల సంఘం అధికారులకు గతంలో వినతి పత్రం అందించింది. అయితే దీనిపై స్పందించిన అధికారులు 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించారు. కానీ తాజాగా మరోసారి ఈవీఎం మెషీన్ బ్యాలెట్ లో చేర్చింది. దీనిపై ఎన్నిసార్లు ఎన్నికల అధికారులకు విన్నవించుకున్నా వారు స్పందించలేదు. దీంతో బుధవారం ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తమ పార్టీ గుర్తులను ఇతర పార్టీలకు ఎవరికీ కేటాయించకుండా ఉండేలా చూడాలని ఈ పిటిషన్లో పేర్కొంది. దీంతో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని.. ఓటర్లు కారు అనుకుని ఇతర గుర్తులను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది.
గతంలో స్వతంత్ర్య అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో చాలా గుర్తులు కారును పోలి ఉండటాన్ని వివరించింది. కెమెరా, చపాతి కర్ర, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ ఈ గుర్తులు కారును పోలినట్లు కనిపిస్తున్నాయని తెలిపింది. వీటిని రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇలాంటి గుర్తులను కేటాయించిన అభ్యర్థులు జాతీయ పార్టీల అభ్యర్థుల కంటే అధికంగా ఓట్లను సాధించిన ఉదంతాలను ఉదహరించింది. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం వీటిని ఎట్టి పరిస్థితుల్లో కేటాయించకుండా తగు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ పిటిషన్ ను బుధవారం స్వీకరించిన హై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
T.V.SRIKAR