ఎంత పనిచేసావ్ రోహిత్, హెడ్ క్యాచ్ వదలేసిన కెప్టెన్
క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ చెబుతారు... ఒక్క క్యాచ్ పట్టినా, ఒక్క క్యాచ్ వదిలేసినా అది మ్యాచ్ ను మలుపుతిప్పుతుంది...చాలా సార్లు ఇది రుజువైంది కూడా... తాజాగా గబ్బా టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం ఆసీస్ కు భారీస్కోర్ అందించింది.
క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ చెబుతారు… ఒక్క క్యాచ్ పట్టినా, ఒక్క క్యాచ్ వదిలేసినా అది మ్యాచ్ ను మలుపుతిప్పుతుంది…చాలా సార్లు ఇది రుజువైంది కూడా… తాజాగా గబ్బా టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం ఆసీస్ కు భారీస్కోర్ అందించింది. సెంచరీతో కదంతొక్కిన హెడ్ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ వదిలేశాడు. స్లిప్‌లో హెడ్ క్యాచ్‌ను జారవిడిచాడు. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ తర్వాత హెడ్‌ను ఔట్ చేసే అవకాశం వచ్చింది. నితీశ్ రెడ్డి వేసిన బంతిని హెడ్ షాట్‌కు యత్నించాడు. కానీ బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్‌లో ఉన్న రోహిత్ తన ఎడమ వైపుకు బంతిని అందుకోవడానికి రెండు చేతులతో ప్రయత్నించాడు. కానీ క్యాచ్‌ను విజయవంతంగా అందుకోలేకపోయాడు. అది సులువైన క్యాచ్ కానప్పటికీ, అందుకోలేనంత కష్టతరమైన క్యాచ్ అయితే కాదని కామెంటటేర్స్ సైతం వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హెడ్ సెంచరీతో కదంతొక్కాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. భారత్ అంటేనే రెచ్చిపోయే ట్రావిస్ హెడ్ కోసం రోహిత్ ప్రత్యేక వ్యూహాలు అమలు చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అడిలైడ్ టెస్టులో హెడ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత అయినా అతన్ని కట్టడి చేసేందుకు సరైన బౌలింగ్ ప్లాన్స్ చేయలేకపోయాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెడ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచించలేదు. సాధారణ కెప్టెన్సీతోనే రోహిత్ జట్టును నడిపించాడు. హెడ్ ఎటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన వెంటనే రోహిత్ డిఫెన్సివ్ కెప్టెన్సీకి వెళ్లిపోయాడు. హెడ్‌ను కట్టడిచేయడానికి ఫీల్డర్లను కూడా ప్రత్యేకంగా మోహరించలేదని రోహిత్‌పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎప్పటిలానే ఇండియాపై మరోసారి హెడ్ రెచ్చిపోయాడు. కీలక ఇన్నింగ్స్ తో గబ్బా టెస్టును ఆస్ట్రేలియా వైపు తిప్పాడు. 75 పరుగులకే ఆసీస్ టాప్ లేపిన భారత బౌలర్లు తర్వాత హెడ్ ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. అతన్ని కనీసం ఇబ్బంది పెట్టలేకపోవడం ఆసీస్ భారీస్కోరుకు కారణమైంది. ఓవరాల్ గా టీమిండియాపై తన అద్భుతమైన రికార్డును హెడ్ మరోసారి కంటిన్యూ చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్- 2023 ఫైనల్ నుంచి టీమిండియాపై హెడ్ ఆడిన గత 11 ఇన్నింగ్స్‌ల్లో 84.90 సగటుతో 849 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత అయిదు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌పై 104.8 సగటుతో హెడ్ పరుగులు చేశాడంటే భారత బౌలర్లను ఎలా ఆడుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు.