Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ముగ్గురి అరెస్ట్.. ఈ ముగ్గురు తారుమారు చేసి సాక్ష్యాలేంటి ?
ఒడిశా రైలు ప్రమాదంలో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న అధికారులు.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా రైల్వే ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించిన సీబీఐ.. కీలక సాక్ష్యాలను రాబట్టింది. ఈ సాక్ష్యాల ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాలను నాశనం చేశారన్న అభియోగాలు నమోదు చేసిన సీబీఐ.. ఆ ముగ్గురిని కటకటాల వెనక్కి పంపింది. వారి నుంచి మరింత సమాచారం రాబట్టి.. ఘటన వెనక పూర్తి కారణాలను లాగేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు ఉద్యోగుల వివరాలను సీబీఐ బయటపెట్టింది. అరుణ్ కుమార్ మహంతా, జూనియర్ సెక్షన్ ఇంజనీర్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌గా గుర్తించారు. ఈ ముగ్గురి మీద ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను నాశనం చేయడం సహా వివిధ అభియోగాలను వీరిపై మోపారు.
జూన్ 2 వ తేదీన ప్రమాదం జరగగా.. జూన్ 6న సీబీఐ అధికారులు ఈ కేసును తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పలువురు రైల్వేశాఖ ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ అరెస్ట్‌లు చేశారు. బాలాసోర్ దగ్గర కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు సహా మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 290 మందికి పైగా చనిపోయారు. సాక్ష్యాలు తారు మారు చేశారన్న అభియోగంపై కేసు నమోదు చేసిన సీబీఐ ధికారులు.. అవి ఎలాంటి సాక్ష్యాలు అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ ముగ్గురు ఏం చేశారు.. ఎవరిని కాపాడాలాని సాక్ష్యాలను తారుమారు చేశారు. ఈ ప్రమాదం వెనక పెద్ద కుట్రే ఉందా అనే అనుమానాలు ఇప్పుడు జనాల్లో వినిపిస్తున్నాయ్.