Asia Cup: ఇలా ఆడితే ఆసియా కప్ మనదే..
ఆసియా కప్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. అన్నింటికంటే ముందే ఫైనల్‌లోకి దూసుకెళ్లి, సండే సమరానికి సై అంటోంది. ఇంతకీ ఫైనల్లో టీమిండియాతో తలపడేదెవరు ?
ఆసియా కప్ క్లైమాక్స్‌కు చేరింది. ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయ్. ఇందులో ఒకటి భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. శుక్రవారం ఈ రెండు జట్లు తలపడనున్నాయ్. ఐతే ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా టీమిండియాకు వచ్చిన నష్టమేమీ లేదు. టాప్ స్కోరుతో ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది రోహిత్ సేన. ఇక మరో మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టుగా ఉండబోతోంది. గురువారం శ్రీలంకను ఢీకొననుంది పాక్. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో ఆదివారం భారత్‌తో ఆడుతుంది. ఐతే టీమిండియాను ఢీకొనబోయే ఆ జట్టు ఏంటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
పాక్, శ్రీలంక జట్ల బలాబలాలను చూస్తే.. లంక కంటే పాక్ చాలా స్ట్రాంగ్. విధ్వంసకర బ్యాటర్లు, మెరుపు వేగంతో విసిరే బౌలర్లు జట్టులో ఉన్నారు. కానీ ఆసియా కప్‌లో మాత్రం లంకదే ఆధిపత్యంగా కన్పిస్తోంది. మొన్న పాక్‌ను సైతం మట్టి కరిపించింది. అదే ఊపుతో రేపటి మ్యాచ్‌లోనూ గెలవాలనే కసితో ఉంది. ఇక లంక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు నిసాంక, కుశాల్ మెండిస్ పవర్‌ప్యాక్డ్ ఓపెనింగ్ ఇస్తున్నారు. మరోవైపు మిడిలార్డర్‌లో కెప్టెన్ శనక, భానుక రాజపక్ష స్టడీగా ఆడుతున్నారు. క్రీజులో పాతుకుపోయి ఉంటున్నారు. ఇటు బౌలింగ్‌లో హసరంగ తన స్పిన్ మాయాజాలంతో కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. పేసర్లు మహీష్ తీక్షణ, ప్రమోద్ ఫామ్‌లో ఉండటం అదనపు అడ్వాంటేజ్. ఇక సూపర్-4 మ్యాచులో పాక్‌ను ఓడించి మంచి ఊపుమీదుంది లంక.
ఇటు పాకిస్థాన్‌ను అస్సలు తక్కువ అంచనా వేయలం. వాళ్లు ఎప్పుడెలా ఆడుతారో ఊహించలేం. మ్యాచ్‌ను ఒక్కసారిగా టర్న్ చేస్తుంటారు పాక్ ఆటగాళ్లు. ముఖ్యంగా కేప్టెన్ బాబర్ ఆజం మెరుపు బ్యాటింగ్ చేస్తుంటాడు. ఒంటిచేత్తో మ్యాచులను గెలిపించిన ట్రాక్ రికార్డు ఉంది. అతడికి వన్డేల్లో మంచి స్ట్రైక్ రేట్ ఉంది. పాక్ జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్ కూడా. ఇక మరో బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా చాలా డేంజర్. అతడిని త్వరగా ఔట్ చేస్తే పాక్ బ్యాటింగ్‌ను కంట్రోల్ చేసినట్టే. పవర్ ప్లేలో మంచి స్కోరు అందించడం రిజ్వాన్ స్పెషాల్టీ.
ఐతే బౌలింగ్‌లో మాత్రం కాస్త వీక్‌గా కన్పిస్తోంది. కీలక మ్యాచ్‌లకు ముందు స్టార్ పేస్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, నసీమ్ షాలు ఆసియాకప్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో యువ పేసర్లు షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చారు. వీరిద్దరు లంక బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తిగా మారింది. సూపర్ 4 లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది పాకిస్థాన్. లంకను మట్టి కరిపించి ఫైనల్‌కు రావాలనే కసితో ఉంది. అదే జరిగితే.. ఫైనల్‌లో టీమిండియా, పాకిస్థాన్ మధ్య సూపర్ ఫైట్ జరగనుంది. దీంతో రేపటి మ్యాచ్ కోసం పాకిస్థాన్, లంకతో పాటు భారత అభిమానులు సైతం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.