Telangana Election: సీజ్ చేసిన సొత్తును తిరిగి ఇచ్చేయండి.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం డబ్బు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుంటే తిరిగి ఇచ్చేయండి అని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.

The Chief Electoral Officer said that gold money seized during police checks should be returned if it is not related to political parties.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి భారీ ఎత్తున బంగారం, డబ్బు, మద్యం సీజ్ చేశారు. ఇప్పటి వరకు రూ. 350 కోట్లకు పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న సొత్తులో ఎన్నికలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదనుకుంటే సదరు యజమానులకు వెంటనే తిరిగి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ముందస్తు ప్రచారంతో మంచి ఫాంలో ఉంది. కాంగ్రెస్ అటు అభ్యర్థుల ప్రకటన, ఇటు బస్సు యాత్రలు, సభలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో పోలీసులు కూడా తమ విధులను పకడ్బంధీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాల అనుమానాస్పద ప్రాంతాల్లో, సిటీ వెలుపల బారీకేట్లను ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు.
ఇదిలా ఉంటే గతంలో ఏదో ఒక అవసరం నిమిత్తం తీసుకెళ్తూ పట్టుబడి సీజ్ చేసిన సొత్తును తిరిగివ్వటంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పెద్దసంఖ్యలో కంప్లైంట్స్ వస్తున్నాయని సీఈసీ సీనియర్ డిప్యూటీ కమిషనర్ నీతీష్‌కుమార్ వ్యాస్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఢిల్లీ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తనిఖీలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని.. త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రైతుబంధు, దళితబంధు నిధులు పంపిణీ చేయకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ పథకాల అమలు, చేసిన ఖర్చు, తాజా స్థితిపై రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, వ్యవసాయశాఖలు నివేదిక అందించాలని ఈ సందర్భంగా ఈసి సూచించింది.
T.V.SRIKAR