Toyota Cars: టయోటా కార్ల ఉత్పత్తి నిలిపివేత..ఆందోళనలో కస్టమర్లు.. కారణం ఏంటో తెలుసా..?
టయోటా కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ. దీనికి కారణాలను వెల్లడించింది.
టయోటా అనగానే మంచి ఫీచర్లతో ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాధారణ కలిగిన కారు కంపెనీ అని చెప్పేస్తారు. ఈ కార్ల కంపెనీ తన ఉత్పత్పులను నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో వినియోగదారులందరూ ఆందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద పేరొందిన కంపెనీ ఎందుకిలా చేసిందో అనే ప్రశ్న చాలా మందిలో రేకెత్తుతుంది. దీనికి టయోటా యాజమాన్యం వివరణ ఇస్తూ ఒక నోట్ విడుదల చేసింది.
14 తయారీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి..
జపాన్ కేంద్రంగా ఈ కార్ల ఉత్పత్తి జరుగుతుంది. బుధవారం సాయంత్రం మొత్తం 14 తయారీ కేంద్రాల్లో ఉత్పత్తిని నిలిపివేశామని తెలిపింది. దీనికి కారణాలను కూడా వివరించింది. కార్ల తయారీకి సంబంధించిన విడిభాగాల ఆర్డర్లను పర్యవేక్షించే కంప్యూటర్ సిస్టంలో కొంత సాంకేతిక లోపం తలెత్తినట్లు వెల్లడించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ మార్కెట్లో టయోటాకు ఉన్న బ్రాండింగ్ అంతా ఇంత కాదు. ఈ సంస్థ ఉన్న పళంగా ఉత్పత్తిని నిలిపివేసిందనే వార్త వినగానే కంగారుపడ్డ కస్టమర్లకు యాజమాన్యం తెలిపిన ప్రెస్ నోట్ తో కాస్త ఊరట కలిగినట్లయింది. కేవలం తాత్కాలికంగానే నిలిపివేసినట్లు అర్థం చేసుకున్నారు. అయితే సంస్థ ఎప్పుడు తిరిగి ఉత్పత్తిని పునరుద్దరిస్తారన్నది మాత్రం తెలుపలేదు. అలాగే ఏఏ మోడల్ కార్లు ఇలా నిలిచిపోయిన వాటిలో ఉన్నాయో కూడా వెలువరించలేదు.
మార్కెట్లోకి ఆలస్యంగా కొత్తకార్లు..
ఇంత పెద్ద సంస్థ స్పేర్స్ పర్యవేక్షించే సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడానికి కారణం సైబర్ నేరగాళ్లా అనే అనుమానం తలెత్తుతుంది. కార్ల ఉత్పత్తిలో ఇంత కీలకపాత్ర పోషించే సిస్టంపై సంస్థ ఏవిధమైన భద్రతా చర్యలు తీసుకోదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సంస్థ సాంకేతికతపై హ్యాకింగ్ జరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఎవరై ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. దీని ప్రభావం భవిష్యత్తులో రానున్న కార్లపై పడుతుంది. ఇప్పటికే కొందరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు కార్ల డెలివరీలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనాలోనూ నిలిచిపోయిన ఉత్పత్తి..
ఈ సంస్థకు ఇలాంటివి కొత్తేమీ కాదు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడి ఉత్పత్తిలో కొంత జాప్యం జరిగినట్లు చెబుతున్నారు. అయితే కొన్ని వారాలకే ఆ సమస్య తొలిగిపోయింది. అయితే తాజాగా ఈ సమస్య వస్తువులది కాదు. సాంకేతికతది కావడంతో ఎప్పుడు తిరిగి ఉత్పతి మొదలౌతుందనే విషయంలో స్పష్టత రావడంలేదు. ఏది ఏమైనా సాంకేతికత వచ్చాక దీని ప్రభావం ప్రతి దానిపై తీవ్రంగా ప్రభావం చూపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
T.V.SRIKAR