Congress Party: కాంగ్రెస్.. మిషన్ “జీ-23”

కాంగ్రెస్ రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. తాజాగా జీ 23 సదస్సులో దాదాపు 39 మంది కొత్త సభ్యులతో సీడబ్ల్యూసీ పునర్వవస్థీకరణ జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2023 | 07:11 AMLast Updated on: Aug 21, 2023 | 7:11 AM

The Cwc Was Restructured With 39 Members In The 23rd Meeting Of The Congress

* అధిష్టానంతో విభేదించిన నేతలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో ఛాన్స్
* సచిన్ పైలట్, ఆనంద్ శర్మ, శశిథరూర్ లకు చోటు
* 39 మంది సభ్యులతో సీడబ్ల్యూసీ పునర్ వ్యవస్థీకరణ
* వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కమిటీలో కూర్పు
* సీడబ్ల్యూసీలోకి ఏపీ నేత రఘువీరా రెడ్డి
* శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బిరామి రెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనర్సింహ
* ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, వంశీచందర్ రెడ్డి

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ కొత్త టీమ్ రెడీ అయింది. కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉండే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. అసంతృప్తులను బుజ్జగించేలా.. అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయనే సందేశాన్ని పార్టీ క్యాడర్ లోకి పంపేలా ఆచితూచి సీడబ్ల్యూసీ నూతన కార్యవర్గాన్ని కూర్చారు. పట్టుదలకు పోకుండా పట్టు విడుపులతో వ్యవహరించారు. సీడబ్ల్యూసీ కార్యవర్గంలో చోటు సంపాదించిన 39 మంది జాబితాలో.. గతంలో కాంగ్రెస్ అధిష్టానంతో విబేధించిన “జీ-23” సీనియర్ నేతల బ్యాచ్ లోని ఆనంద్‌ శర్మ, శశి థరూర్‌ పేర్లు కూడా ఉండటం గమనార్హం. సీనియర్లకు పార్టీలో గౌరవం లేదంటూ 23 మంది లీడర్లు జీ-23 పేరుతో సోనియా గాంధీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పార్టీలో సంస్థాగత మార్పులు అనివార్యమని వారు ఆనాడు సోనియా గాంధీని డిమాండ్ చేయడం రాజకీయ ప్రకంపనలు రేకెత్తించింది. గతేడాది అక్టోబరులో జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లోనూ మల్లికార్జున ఖర్గేపై శశి థరూర్‌ పోటీచేసి ఓడిపోయారు. త్వరలో రాజస్థాన్‌ అసెంబ్లీ పోల్స్ జరగనున్న దృష్ట్యా.. 2020లో సీఎం పోస్టు కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ను కూడా అధిష్ఠానం వర్కింగ్‌ కమిటీలో చేర్చింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్ మధ్య విభేదాలున్న నేపథ్యంలో ఇటీవల రాహుల్ గాంధీ, ఖర్గే వారి మధ్య రాజీ కుదిర్చారు. పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఉంటుందనే మెసేజ్ ను ఇచ్చేటందుకు సచిన్‌ పైలట్ కు ఈ ఛాన్స్ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పలుమార్లు సమావేశమైన తర్వాతే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ లిస్టును విడుదల చేసినట్టు తెలుస్తోంది.

39 మంది ముఖ్యుల్లో..

39 మంది సీడబ్ల్యూసీ సభ్యుల జాబితాలో మల్లికార్జున ఖర్గే, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏకే ఆంటోనీ, అంబికా సోని, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అజయ్ మాకెన్, సల్మాన్ ఖుర్షీద్, జైరామ్ రమేష్, రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా, అభిషేక్ మను సింఘ్వి, తారిఖ్ అన్వర్, ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, గౌరవ్ గొగోయ్, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఈ కీలక కమిటీలో ఏపీ నుంచి రఘువీరా రెడ్డికి చోటు కల్పించగా, తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ పదవులకు నియమితులయ్యే వారిలో సగం మంది 50 ఏళ్లలోపు వారే ఉండాలని పార్టీ గతంలో నిర్ణయించింది. అయితే తాజా సీడబ్ల్యూసీలో సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్, కమలేశ్వర్ పటేల్ మాత్రమే 50 ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. ప్రియాంకాగాంధీకి సీడబ్ల్యూసీలో చోటు ఇచ్చినందున.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి ఆమెను తప్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు. సీడబ్ల్యూసీలో కొత్తగా చేరిన వారిలో దీప దాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సేన్ ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత ప్రియ రంజన్ దాస్ భార్య దీప దాస్ మున్షి. కాంగ్రెస్ నేషనల్ మీడియా ప్యానెలిస్ట్‌గా గతంలో పని చేసిన నసీర్ హుస్సేన్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ.

శాశ్వత ఆహ్వానితులు.. ప్రత్యేక ఆహ్వానితుల్లో

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వానితులుగా 32 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఏపీ కాంగ్రెస్ నేతలు టి.సుబ్బిరామి రెడ్డి, కొప్పుల రాజు, తెలంగాణ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కూడా ఉన్నారు. శాశ్వత ఆహ్వానితుల్లో 14 మందిని సీడబ్ల్యూసీ ఇంఛార్జిలుగా నియమించారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మందిని ఎంపిక చేశారు. ఈ లిస్టులో ఏపీ నుంచి పల్లం రాజు, తెలంగాణ నుంచి వంశీచందర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ప్రత్యేక ఆహ్వానితుల్లో నలుగురిని సీడబ్ల్యూసీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా నియమించారు.