తిరుమల వెంకన్న సంపదను రక్షిస్తున్న దేవతలు… శంఖనిధి, పద్మనిధి గురించి మీకు తెలుసా..!
తిరుమల వేంకటేశ్వరుడిది అంతులేని సంపద. రాజుల కాలం నుంచి వెలకట్టలేని ఆభరణాలు స్వామివారికి సమర్పించేవారు. ప్రస్తుతం ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా వెంకన్న ఖజానాకు చేరుతుంది. మరి ఆ సంపదకు రక్షకులు ఎవరు..?

తిరుమల వేంకటేశ్వరుడిది అంతులేని సంపద. రాజుల కాలం నుంచి వెలకట్టలేని ఆభరణాలు స్వామివారికి సమర్పించేవారు. ప్రస్తుతం ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా వెంకన్న ఖజానాకు చేరుతుంది. మరి ఆ సంపదకు రక్షకులు ఎవరు..? ఇప్పుడైతే టీటీడీ, పాలకమండళ్లు ఉన్నాయి.. ఇది వరకు. అప్పుడైనా.. ఇప్పుడైనా.. స్వామివారి సంపదకు రక్షకులు ఆ ఇద్దరు దేవతలేనట. ఆలయంలోనే ఉంటూ… వెంకన్న సందపకు కాపలా కాస్తురాన్నారట. ఎవరా దేవతలు..? ఆలయంలో ఎక్కడ ఉంటారు..?
కలియుగ ప్రత్యక్ష దైవం… తిరుమల శ్రీనివాసుడు. ఏడుకొండలపై కొలువుదీరి భక్తులు కొలిచే కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆపదమొక్కులవాడికి… తమ స్థాయికి తగ్గట్టు హుండీలో నగదు వేస్తారు. కొంతమంది నిలుపుదోపిడీ కూడా ఇచ్చుకుంటారు. ఇలా రోజుకి కోటి రూపాయలపైన వస్తుంది హుండీ ఆదాయం. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో హుండీ ఆదాయం సుమారు మూడు కోట్ల పైమాటే. ఇలా ఏడాదికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుంది హుండీ ఆదాయం. ఈ సంపదను ఎప్పటికప్పుడు లెక్కగడుతుంది టీటీడీ. మరి టీటీడీ లేకముందు… శ్రీవారి సంపదకు రక్షకులెవరు..? అప్పుడైనా.. ఇప్పుడైనా.. తిరుమల శ్రీనివాసుడి సంపదకు ఇద్దరు దేవుళ్లు రక్షకులుగా ఉంటున్నారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు దేవుళ్లు శంఖనిధి, పద్మనిధి.
శంఖనిధి,పద్మనిధి… శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవుళ్లు. శ్రీవారి ఆలయ మహాద్వార గడపకు ఇరువైపులా ద్వారపాలకులుగా ఉంటారు. ఎడమవైపున అంటే దక్షిణదిక్కున ఉండే రక్షక దేవుని పేరు శంఖనిధి. కుడివైపున అంటే ఉత్తరదిక్కున ఉండే రక్షక దేవుని పేరు పద్మనిధి. శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించి వుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలతో కనిపిస్తాడు. ఆగమ శాస్త్రం ప్రకారం… ఈ నిధి దేవేళ్లు ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారం దగ్గర ఉంచడం సంప్రదాయం. తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయం. ఈ నిధి దేవుళ్ల పాదాల దగ్గర ఆరు అంగుళాల రాజవిగ్రహం.. నమస్కారం చేస్తున్నట్టు ఉంటుంది. అది విజయనగర రాజు అచ్యుతదేవరాయలది. అంటే… అచ్యుతరాయలే.. ఈ నిధిదేవుళ్లను ప్రతిష్టించి ఉండొచ్చు.
ఈ నిధి దేవుళ్లు.. తిరుమల ఆలయ మహాద్వారానికి ఇరువైపులా… రెండు అడుగుల ఎత్తున ఉంటాయి. ఇవి పంచలోహ విగ్రహాలు. ఆలయంలోకి ప్రవేశించే ముందు… భక్తులు కాళ్లు కడుక్కునేలా.. నీళ్లు పారుతూ ఉంటాయి. అక్కడే… ఆ గడప దగ్గరే.. ఇరువైపులా కనిపిస్తాయి ఈ శంకునిధి, పద్మనిధి విగ్రహాలు. క్యూలైన్లలో వేచి ఉండి.. శ్రీవారి దర్శనం ఎప్పుడు చేసుకుందామని అనే అతృతలో…. ఆలయంలోకి ప్రవేశిస్తున్నామన్న ఆనందంలో… భక్తులు… ఆ దేవుళ్లను గమనించరు. ఈసారి తిరుమల వెళ్లినప్పుడు… గమనించండి. అనాదిగా.. శ్రీవారి సంపదను రక్షిస్తున్న ఆ దేవుళ్లను దర్శించుకోండి. వాళ్లకు ఒక్కసారి నమస్కారించండి… ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించండి.