Ambulance Driver: అంబులెన్స్‌లో మిర్చి బజ్జీలకు.. వార్నింగ్ ఇచ్చిన డీజీపీ..
ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చారనే కాదు.. ట్రీట్‌మెంట్‌కు ఎంతసేపట్లో తీసుకువచ్చారన్నది కూడా ముఖ్యం. అంబులెన్స్‌లు ఇందులో ప్రధాన పాత్ర వహిస్తాయ్.

కుయ్‌కుయ్ అంటూ మోగుతూ.. యముడిని దగ్గరికి రాకుండా చేస్తాయ్. అంత గొప్పదనం ఉన్న అంబులెన్స్‌లను బజ్జీలు తెచ్చుకునేందుకు వాడుకున్నాడో డ్రైవర్. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో.. ఏకంగా డీజీపీ రియాక్ట్ అయ్యారు. అంబులెన్స్ సైరన్ వినిపిస్తే ఎవరైనా సరే దారి ఇస్తారు. దాన్నే ఆయుధంగా వాడుకున్నాడా డ్రైవర్. అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేశాడు. ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ట్రాఫిక్‌లో సైరన్ మోగిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు.. సిగ్నల్స్‌ను మార్చి ఆ వాహనానికి వెంటనే దారి ఇచ్చారు. కానీ సిగ్నల్ దాటిన తర్వాత డ్రైవర్ ఆ అంబులెన్స్‌ను ఆపి.. టిఫిన్ తిన్నట్లు ట్రాఫిక్ పోలీసు గుర్తించారు. రోడ్డు పక్కనే అగి ఉన్న అంబులెన్స్ దగ్గరకు వచ్చి డ్రైవర్‌ను ప్రశ్నించగా.. నీరసం వస్తుందంటూ పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.
దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం.. ఆ అంబులెన్స్ డ్రైవర్ తీరుపై సీరియస్ అయింది. అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆస్పత్రికి వెళ్లడానికి సైరన్‌ను ఉపయోగించాలని సూచించింది. సమాజ శ్రేయస్సుకు మనమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది. రాష్ట్ర డీజీపీ కూడా దీనిపై ట్వీట్ చేయడంతో.. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అంబులెన్స్ అంటే ప్రాణాలు కాపాడే వాహనం. అలాంటి వాహనాన్ని ఇష్టానికి వాడుకుంటే అది నిజంగా పాపమే అవుతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.