ఇది ఆరంభం మాత్రమే రిటైర్మెంట్ బాటలో మరికొందరు
భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం ఇప్పుడే మొదలైంది. గబ్బా టెస్ట్ చివరిరోజు రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వీడ్కోలు పలకడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెర్త్ టెస్టుతోనే అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని, తానే ఆపానంటూ కెప్టెన్ రోహిత్ చెప్పినప్పటకీ... అశ్విన్ వీడ్కోలు మాత్రం అందరికీ షాకే...
భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం ఇప్పుడే మొదలైంది. గబ్బా టెస్ట్ చివరిరోజు రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వీడ్కోలు పలకడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెర్త్ టెస్టుతోనే అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని, తానే ఆపానంటూ కెప్టెన్ రోహిత్ చెప్పినప్పటకీ… అశ్విన్ వీడ్కోలు మాత్రం అందరికీ షాకే… అయితే ఈ రిటైర్మెంట్ల పర్వంలో ఇది మొదలు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరికొందరు సీనియర్ ప్లేయర్స్ అదే బాటలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా వచ్చే ఏడాది గుడ్ బై చెబుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో రోహిత్ , కోహ్లీలతో పాటు పుజారా, రహానే, జడేజా వంటి స్టార్ ప్లేయర్స్ ఉండగా… అందరికంటే ముందు హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ఉంటుందన్న వార్త తెగ వినిపిస్తోంది.
రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవమైన ఫామ్ లో ఉన్నాడు. ఆసీస్ తో సిరీస్ కు ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లలోనూ రాణించలేదు. టెస్ట్ క్రికెట్ కు అతను వీడ్కోలు పలికే టైమొచ్చిదంంటూ పలువురు మాజీలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రోహిత్ టీ ట్వంటీ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. అటు విరాట్ కోహ్లీది మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితి… ఇటీవల పెర్త్ టెస్టులో సెంచరీ కొట్టిన కోహ్లీ తర్వాత మళ్ళీ వైఫల్యాల బాటలోనే నడుస్తున్నాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతిని కొట్బబోయి తన వికెట్ ను తానే ఇచ్చుకుంటున్నాడు. దీంతో కోహ్లీ సైతం వచ్చే ఏడాది రిటైర్ కానున్నాడని భావిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత విరాట్ ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది.
అలాగే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన టైమొచ్చింది. బ్రిస్బేన్ టెస్టులో జడ్డూ 77 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ యువకుల కోసం తాను రిటైర్మెంట్ ప్రకటించక తప్పదు. వచ్చే ఏడాది జూన్-జూలైలో టీమిండియా వరుస టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో ఈ సీనియర్లు ఉండటం అసాధ్యంగానే కనిపిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టెస్టులకు వీడ్కోలు పలికే అవకాశం ఉందంటున్నారు. 2012-13లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా రిటైర్ అయ్యారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు జట్టులో భాగమయ్యారు. సో ఇప్పుడు రోహిత్, కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లు పక్కకు తెప్పుకుంటే యువకులు జట్టులోకి రానున్నారు. వాషింగ్టన్ సుందర్‌ని జట్టులోకి తీసుకోవడంతోనే అశ్విన్ రీటైర్మెంట్ ప్రకటించాడన్న వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో సీనియర్లకు ఇక టెస్టు దారులు మూసుకుపోయాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.