Jedimetla Building: భవనం ఎత్తు పెంచేందుకు చేసిన ప్రయోగం విఫలం.. పక్కకు ఒరిగిన బిల్డింగ్..
మనం నిత్యం కారు, లారీ, బస్సులకు పంచర్ అయినప్పుడు లేదా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు జాకీ ఉపయోగించి వాహనాన్ని కొన్ని సెంటీమీటర్ల ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా రిపేర్ చేయడానికి వాహనం టైరు మార్చేందుకు మార్గం సులుభతరం అవుతుంది. అలా కాకుండా ఇంటినే ఎత్తాలనుకుంటే అది కాస్త ఆశ్చర్యంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ప్రయోగాన్ని చేసి పోలీస్ స్టేషన్ పాలయ్యారు కొందరు. అసలు ఏం జరిగింది అనే అంశాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ కూడలి వద్ద ఉన్న శ్రీనివాస నగర్ కాలనీలోని ఒక భవనాన్ని జాకీలతో కొద్దిగా ఎత్తు పెంచేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం ఫలించకపోగా పక్కన ఉన్న భవనానికి ఇబ్బందిగా మారింది. నర్సింహారావు అనే వ్యక్తి పాతికేళ్ల క్రితం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటూ రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. క్రమక్రమంగా అక్కడి రోడ్డు ఎత్తు పెరగడంతో ఇళ్లు దిగువ ప్రాంతంగా మారిపోయింది. వర్షం కురిసిన ప్రతిసారీ వరదనీరు ఇంటిలోకి ప్రవేశిస్తుంది. దీనికి ప్రత్యమ్నాయ చర్యలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో విజయవాడకు చెందిన ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడి హైడ్రాలిక్ సహాయంతో బిల్డింగ్ ఎత్తు పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టేందుకు ముందుగా ఆ భవనంలో అద్దెకు ఉంటున్న ఆరు కుటుంబాల వారిని ఖాళీ చేయించారు. ఇంటి యాజమానితో పాటూ వారి బంధువులు మాత్రమే ప్రస్తుతం ఒక ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి హైడ్రాలిక్ జాకీలు ఉపయోగించి భవనం ఎత్తు పెంచేందుకు ప్రయత్నించగా అది విఫలమైంది. హైడ్రాలిక్ అదుపుతప్పడంతో ఈ భవనం పక్కనే ఉన్న ఇంటి వైపుకు ఒరిగింది. ఈ సమాచారం అందిన వెంటనే జీడిమెట్ల సీఐతో పాటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ప్రణాళికా విభాగం అధికారులు అక్కడకి చేరుకున్నారు. ప్రాధమిక భద్రతా చర్యలు చేపట్టి అనుమతులు లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేసినందుకు ఇంటి ఓనర్ పై కేసు నమోదు చేశారు. పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చేందుకు నిర్ధారించారు మున్సిపల్ అధికారులు. ప్రభుత్వ అధికారులకు ఏవిధమైన సమాచారం తెలుపకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇరుగు పొరుగు వారికి ప్రమాదం అని తెలిపారు.
T.V.SRIKAR