Ahmedabad Stadium: ప్రపంచకప్ టోర్నీలో తొలిమ్యాచ్.. ప్రేక్షకులు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం
ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదనేది నిజం. అలాంటి ఆటకు సంబంధించి వరల్డ్ కప్ టోర్నీయే అత్యుత్తమమైనది. అయితే, అంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం పేలవంగా ఉంది. ప్రారంభ వేడుకలు లేకుండానే.. టోర్నీ మొదలు కావడం, అందులోనూ అహ్మదాబాద్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేవారు లేక.. అక్కడి స్టేడియం వెలవెలబోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదనేది నిజం. అలాంటి ఆటకు సంబంధించి వరల్డ్ కప్ టోర్నీయే అత్యుత్తమమైనది. అయితే, అంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం పేలవంగా ఉంది. ప్రారంభ వేడుకలు లేకుండానే.. టోర్నీ మొదలు కావడం, అందులోనూ అహ్మదాబాద్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేవారు లేక.. అక్కడి స్టేడియం వెలవెలబోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం అదుర్స్‌గా ఉంటుందనుకుంటే.. అందుకు రివర్స్‌గా పరిస్థితి కనిపించింది. ఐసీసీ వరల్డ్ కప్-2023 మొదటి మ్యాచ్‌లో జోష్ లేకుండా పోయింది. నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠ్మాతక వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ బేజారెత్తించింది. ఇంకా చెప్పాలంటే.. ఇదొక వార్మప్ మ్యాచ్‌లా జరిగింది.
ఈ మెగా టోర్నీకి తొలిసారి భారత్ ఒంటరిగా అతిథ్యమిస్తోంది. బీసీసీఐ టోర్నీ నిర్వహణ బాధ్యతలను భుజాలకెత్తుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరిగింది. తొలి పోరులో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఇందులో కివీస్ జట్టు ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో గెలుపోటముల సంగతి పక్కనపెడితే.. ప్రతిష్టాత్మక టోర్నీ తొలి మ్యాచ్ అంటే ఎలా ఉండాలి.. ప్రేక్షకులకు కిక్కిచ్చేలా ఉండాలి. ప్రేక్షకుల హడావుడి, ఈలలు, చీర్స్, గెంతులు ఇలా ఒకటేంటి.. ప్రేక్షకుల సందడి మధ్య రెండు జట్లు తలపడుతుంటే చూసేందుకు రెండూ కళ్లూ చాలవు అన్నట్లుగా వాతావరణం కనిపించాలి. అయితే, టోర్నీ మొదటి మ్యాచ్ మాత్రం ఎంతో చప్పగా, బోరింగా జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 1.32 లక్షల మేర సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇంతపెద్ద స్టేడియంలో వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేవారు కరువయ్యారు. ప్రేక్షకులు లేక నరేంద్ర మోడీ స్టేడియం వెలవెలబోయింది. 1.32 లక్షల మంది కూర్చునేలా ఉన్న స్టేడియంలో కేవలం 4 వేల మంది ఉండటంతో.. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ఇక్కడొకరు.. అక్కడొకరు అన్నట్లుగా మాత్రమే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ అంటే టోర్నీకి కిక్కిచ్చేలా ఉండాలి. ప్రేక్షకుల హోరు నడుమ, రెండు జట్లు ఉత్సాహంతో తలపడుతుంటే.. ఆ మజాయే వేరు. కానీ, మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆ దాఖలాలు కనిపించకపోవడంపై క్రికెట్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్టేడియం ఖాళీగా దర్శనమివ్వడంపై పలురకాలుగా స్పందిస్తున్నారు. ఇది నిజంగా బాధాకరమని ఆవేదన చెందుతున్నారు. భారత్‌లో వరల్డ్ కప్ టోర్నీ సన్నాహాలు ఆలస్యంగా మొదలుకావడం, టికెట్ల బుకింగ్‌లో సమస్యలు కూడా ప్రేక్షకుల లేమికి కారణమైనట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్ లంటే కొన్ని నెలల ముందుగానే టికెట్లు మొత్తం అయిపోవడం గతంలో వెల్లడైంది. కానీ, గురువారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మొదలైనప్పటికీ.. వెబ్ సైట్లో ఇంకా టికెట్లు అందుబాటులోనే ఉన్నాయి. ఇది నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
కాగా, గుజరాత్ అధికార పక్షం బీజేపీ.. ఈ మ్యాచ్ కోసం 40 వేల సీట్లను రిజర్వ్ చేసుకున్నట్టు నిర్ధారించింది. ఇటీవల కేంద్ర మహిళా బిల్లును ఆమోదింపజేసుకున్న నేపథ్యంలో, ఆ 40 వేల టికెట్లను మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తామని, వారికి ఉచితంగా లంచ్, టీ కూపన్లు కూడా అందజేస్తామని చెప్పింది. కానీ, ఆ 40 వేల టికెట్ల సంగతి ఏమైందో తెలియదు. స్టేడియం కెపాసిటీలో
కేవలం 3 శాతం మంది గ్రౌండ్‌లో ఈ మ్యాచుని చూడటం ఆశ్చర్యము కలిగిస్తోంది.
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు స్టేడియంలోకి రాలేదని నిర్వాహకులు సాకులు చెబుతున్నారు. అయితే, క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే భారత్‌లో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇంత తక్కువ మంది రావడం ఇదే తొలిసారి. ఇక భారత్ వస్తే గాని స్టేడియం మొత్తం నిండేలా కనిపించడం లేదు. పైగా, ఇంత పెద్ద క్రికెట్ ఉత్సవంలో ప్రారంభ వేడుకలు లేకుండానే పోటీలు మొదలుపెట్టడంపైనా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ తొలి రోజు అట్టర్ ఫ్లాప్ అయింది. మరి రానురాను ఎలా ఉంటుందో చూడాలి.