Prigogine: రష్యా అధ్యక్షుడికి నాటి సన్నిహితుడు.. నేటి తిరుగుబాటుదారుడు దుర్మరణం
వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్లు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ వెల్లడించింది.
రష్యా అనగానే మనకు పుతిన్ పై ప్రిగోజిన్ తిరుగుబాటు గుర్తుకొస్తుంది. అయితే కొందరి మధ్య వర్తిత్వం వల్ల ఈ యుద్దం ఆగిపోయిందనే చెప్పాలి. ఈ పోరాటం చేయాలనే ఆలోచన కలిగిన వాగ్నర్ గ్రూప్ అధినేత ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్తున్న విమానం రష్యాలోని తెవర్ రీజియన్ చేరుకోగానే సాంకేతిక లోపం తలెత్తడంతో కుప్పకూలిపోయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే వచ్చిన తాజా సమాచారం ప్రకారం అందులో 10 మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. అందులో ఏడు మంది ప్రయాణీకులు కాగా ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నట్లు గుర్తిచారు. ఈ ఏడుగురిలో ప్రిగోజిన్ కూడా ఉన్నారు.
రష్యా సైన్యానికి మద్దతు
ఉక్రెయిన్, రష్యా యుద్దంలో రష్యా సైనికుల పట్ల మద్దతుగా నిలబడ్డారు. దీనికి కారణం రష్యా ప్రభుత్వం తమ సైనిక బలగాలపై కనబరుస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి గానూ రష్యా రక్షణ రంగంపై బాహాటంగానే విమర్శించారు. అప్పటి వరకూ పుతిన్ కు సన్నిహితంగా ఉన్న ప్రిగోజిన్ ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. దీనిపై బెలారస్ అధ్యక్షులు లుకషెంకో స్పందించారు. ప్రిగోజిన్ తో చర్చలు జరిపి శాంతింపజేశారు. దీంతో ఓపెద్ద సమస్యకు తెరపడినట్లయింది.
పుతిన్ అండతో ప్రత్యేక వ్యాపార సామ్రాజ్యం
రష్యా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు ఈ ప్రిగోజిన్. పుతిన్ ప్రతి పనిలో ఇతను సహాయ సహకారాలు అందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పుతిన్ నమ్మే అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఇతను ఒకడు. రష్యా అధ్యక్షుడికి అవసరమైన ఫుడ్ ని ప్రిగోజిన్ తయారు చేస్తారు. 1980లో దొంగతనం, దోపిడీ కేసుల్లో దాదాపు 9 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించారు. ఆతరువాత 1990లో పుతిన్ తో దోస్తీ ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడవడంతో ప్రిగోజిన్ వెలుగులోకి వచ్చారు. అప్పటి దాకా ఎవరికీ ఇతని పేరు కూడా తెలియదు. పుతిన్ అండతో తనకంటూ ఒక ప్రత్యేక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు అభివృద్ది చేసుకున్నాడు. రష్యాలోని సైనిక, పాఠశాలల కు ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టులన్నీ ప్రిగోజిన్ కే దక్కాయి. పుతిన్ కు అవసరమైన సీక్రెట్ ఆపరేషన్స్ అన్నీ ఇతనే దగ్గరుండి నడుపుతారు. ఉక్రెయిన్ దాడులు జరిగే క్రమంలో బఖ్ ముత్ అనే ప్రదాన నగరాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడంలో ప్రిగొజిన్ ప్రదాన భూమిక పోషించారు.
T.V.SRIKAR