కివీస్ తో టెస్ట్ సిరీస్ ఈ వారమే భారత జట్టు ఎంపిక
టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన నాలుగు రోజులకే న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. టెస్ట్ సిరీస్ లో ఆడే కీలక ఆటగాళ్ళందరికీ ప్రస్తుతం రెస్ట్ ఇవ్వగా... ఈ వారమే జట్టును ఎంపిక చేయనున్నారు.
టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన నాలుగు రోజులకే న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. టెస్ట్ సిరీస్ లో ఆడే కీలక ఆటగాళ్ళందరికీ ప్రస్తుతం రెస్ట్ ఇవ్వగా… ఈ వారమే జట్టును ఎంపిక చేయనున్నారు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడిన జట్టునే దాదాపు కొనసాగిస్తారని భావిస్తున్నా… ఒకటిరెండు మార్పులు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మహ్మద్ షమీ రీఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న షమీ ఫిట్ నెస్ సాధిస్తే కివీస్ తో సిరీస్ కు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల గాయం తిరగబెట్టినట్టు వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లేనని షమీ క్లారిటీ ఇవ్వడంతో కివీస్ తో సిరీస్ కోసం అతన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్సుంది. ఆసీస్ తో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు షమీకి కూడా ప్రాక్టీస్ అవసరమని భావిస్తే కివీస్ తో సిరీస్ కు ఎంపిక చేయొచ్చు. అయితే అతని ఎంపిక పూర్తిగా ఫిట్ నెస్ సాధించడంపైనే ఆధారపడి ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే మిగిలిన జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇటీవల బంగ్లాపై ఆడిన టీమ్ నే సెలక్టర్లు కొనసాగించే అవకాశముంది. జైశ్వాల్ , గిల్, కోహ్లీ, కెఎల్ రాహుల్ తో పాటు , సర్ఫరాజ్ ఖాన్ కూడా జట్టులో ఉంటాడు. ప్రధాన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, బ్యాకప్ కీపర్ గా ధృవ్ జురెల్ ఎంపిక లాంఛనమే. ఇక స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నారు. అయితే పేస్ ఎటాక్ లో జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్ తో పాటు ఆకాశ్ దీప్, యశ్ దయాల్ చోటు దక్కించుకోవడం ఖాయం. ఫిట్ నెస్ ఆధారంగా షమీ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. అయితే ఆసీస్ టూర్ కోసం మయాంక్ యాదవ్ ను కూడా సిద్ధం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అతన్ని ఎంపిక చేయడంపై సస్పెన్స్ నెలకొంది. 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మయాంగ్ బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ లో అరంగేట్రం చేసాడు. ఆసీస్ పిచ్ లు అతని బౌలింగ్ కు సరిపోతాయన్న అంచనాల వేళ సెలక్టర్లు ఏం చేస్తారనేది చూడాలి.
కాగా బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. 11 టెస్టులు ఆడి 8 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయశాతం 74.24గా ఉంది. టీమిండియా ఫైనల్ చేరాలంటే మరో నాలుగు మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది. స్వదేశంలో కివీస్ తో సిరీస్ గెలిస్తే ఇక భారత్ కు ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. అదే సమయంలో ఆసీస్ , శ్రీలంక, ఇంగ్లాండ్ కూడా రేసులో ఉన్నాయి. కాగా భారత్, న్యూజిలాండ్ మూడు మ్యాచ్ ల సిరీస్ అక్టోబర్ 16 నుంచి మొదలుకానుంది. తొలి టెస్టుకు బెంగళూరు, రెండో టెస్టుకు పుణే, మూడో టెస్టుకు ముంబై ఆతిథ్యమివ్వనున్నాయి.