Venkata Rami Reddy: డెక్కన్ క్రానికల్ వెంట్రామిరెడ్డి అరెస్ట్.. అసలేంటి కేసు.. ఇప్పుడెందుకు తెరిచినట్లు ?
తెలంగాణలో ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయ్. ప్రజాప్రతినిధుల ఇళ్లపై మెరుపు దాడులు చేస్తూనే మరోవైపు అరెస్టులు చేస్తున్నారు ఈడీ అధికారులు.
దీనిపై రాజకీయ యుద్ధం కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ కావాలని కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయ్. రాజకీయ నేతల సంగతి ఎలా ఉన్నా.. బిజినెస్ టైకూన్లను కూడా ఈడీ వదలడం లేదు. తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు ఇంగ్లీష్ పేపర్ డెక్కన్ క్రానికల్ చైర్మెన్ వెంకట్రామి రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు పిలిపించిన ఈడీ అధికారులు.. వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశారు.
గతంలో రుణాలు ఎగవేసిన ఆరోపణలపై ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే ఇప్పుడు ఈడీ దూకుడు పెంచింది. డీసీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డితో పాటు మరో వ్యాపారవేత్త మణి అయ్యర్‌ను హవాలా, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. గతంలో వెంకట్రామిరెడ్డి వేర్వేరు బ్యాంకులు నుంచి 8వేల 800 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆ కేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టింది. అందులో భాగంగానే వెంకట్రామిరెడ్డిని విచారణకు పిలిపించారు. విచారించిన తర్వాత.. వెంకట్రామిరెడ్డితో పాటు మణి అయ్యర్ అనే మరో ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిపై గతంలో కూడా రుణాలు ఎగ్గొట్టారని… పెద్ద మొత్తంలో డబ్బును దారి మళ్లించారనే అభియోగాలతో 3300 కోట్లకుపైగా అటాచ్ చేసింది ఈడీ.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించారని హవాలా, మనీ లాండరింగ్ కేసులు మోపారు. ఇక ఇప్పటికే తెలంగాణలో ప్రముఖులతో పాటు ప్రజాప్రతినిధులు.. ముఖ్యంగా బీఆర్ఎస్‌కి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.