Pawan Kalyan: పొత్తులు కుదిరాయ్.. మరి సీట్ల సంగతి ఏంటి.? పవన్ కి పాతిక తో సరిపెడతారా.?

టీడీపీ-జనసేన మధ్య పొత్తులు కుదిరాయి. మొన్నటి వరకు పొత్తులపై క్లారిటీ రావాల్సి ఉన్న క్రమంలో సీట్లపై అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పొత్తులు పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు.. ఏయే స్థానాలు ఎవరెవరికి దక్కుతాయనే అంశంపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరి సీటు పోతుంది..? ఎవరి ఫేటు మారుతుంది..?అనే చర్చ జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2023 | 05:52 PMLast Updated on: Sep 16, 2023 | 5:52 PM

The Jana Sena Alliance With Telugu Desam Is Fine But What About The Seats

టీడీపీ-జనసేన మధ్య పొత్తులు కుదిరాయి. మొన్నటి వరకు పొత్తులపై క్లారిటీ రావాల్సి ఉన్న క్రమంలో సీట్లపై అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పొత్తులు పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు.. ఏయే స్థానాలు ఎవరెవరికి దక్కుతాయనే అంశంపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరి సీటు పోతుంది..? ఎవరి ఫేటు మారుతుంది..?అనే చర్చ జరుగుతోంది.

టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి పొత్తు గురించి క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా.. తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకునేందుకు రాష్ట్ర కమిటీని కూడా నిర్వహించారు పవన్. ఇదే సందర్భంలో టీడీపీ కూడా ఉమ్మడి కార్యాచరణకు సిద్దమవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుని మండల స్థాయి వరకు టీడీపీ-జనసేన ఉమ్మడి కమిటీలు వేసుకోబోతున్నాయి. మరోవైపు క్షేత్ర స్థాయిలో టీడీపీ-జనసేన పార్టీలు కొన్ని చోట్ల కలిసి పోరాటాలు చేస్తున్న పరిస్థితి. ఒకరి పొరాటాలకు మరొకరు సంఘీభావాలు తెలుసుకున్న పరిస్థితి. గుంటూరులో మేయర్ వ్యాఖ్యలపై టీడీపీ-జనసేన పార్టీల మధ్య పూర్తి స్థాయి సమన్వయంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. అలాగే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన నిరసన దీక్షను స్థానిక జనసేన నేతలు వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఏయే జిల్లాల్లో సీట్ షేరింగ్ ఏ విధంగా ఉంటుంది..? ఎన్ని సీట్లు వెళ్తాయనే దానిపై టీడీపీ-జనసేన వర్గాల్లో తర్జన భర్జన జరుగుతోంది.

మొత్తంగా 175 స్థానాల్లో జనసేనకు 25-30 స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. యావరేజీన జిల్లాకో స్థానం ఇస్తారని.. ఇంకొన్ని చోట్ల రెండేసి స్థానాలు ఇస్తారని చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాల్లో రెండు స్థానాలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 10-12 స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు.. ప్రకాశం జిల్లాలో ఓ స్థానం ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అలాగే నెల్లూరు, అనంతపురం, చిత్తూరు. కర్నూలు, కడప వంటి జిల్లాల్లో కూడా ఒక్కో స్థానం జనసేనకు పొత్తులో భాగంగా ఇచ్చే సూచనలున్నాయి.

ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఎవరెవరికి సీట్లు పోతున్నాయి.. ఎవరికి సీట్లు దక్కబోతున్నాయనే అంశంపై రెండు పార్టీ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ఇదే సందర్భంలో టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం టీడీపీకి బూస్టప్ ఇచ్చిన పరిస్థితి. దీంతో జనసేన.. పవన్ విషయంలో టీడీపీ కేడర్ లో పూర్తి స్థాయి సానుకూల వాతావరణం ఏర్పడిందని అటు టీడీపీ.. ఇటు జనసేన పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ ముందు నుంచి అనుకున్న దాని కంటే ఎక్కువగానే సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతోంది. దీని ప్రకారం 35-40 స్థానాల వరకు ఇచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. అయితే వాస్తవ పరిస్థితి ఆధారంగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతోందని రెండు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల పరిస్థితేంటీ..? ఎవరి బలబలాలు ఎలా ఉన్నాయనే అంశాలను బేరీజు వేసుకునే పార్టీల మధ్య సీట్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు నేతలు. సీట్ల కేటాయింపులో కానీ.. పార్టీల మధ్య పని విభజన విషయంలో కానీ లీడర్లు మధ్య.. కేడర్ మధ్య ఎలాంటి భేషజాలకు పోకుండా సీట్ల పంపకం ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు.