Sajjala : సజ్జల ఎంపీ ఎప్పుడు అయ్యారు ?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో వాళ్ళ పార్టీ నేతలు, కార్యకర్తలే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తాడేపల్లి ఆఫీసులో జగన్ చుట్టూ ఉన్న కోటరీయే ఆయన కొంప ముంచిందని డైరెక్ట్ గా సజ్జల, ధనుంజన్ రెడ్డి పేర్లను బయటపెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 20, 2024 | 04:34 PMLast Updated on: Jul 20, 2024 | 4:34 PM

The Leaders And Workers Of Their Party Came To The Media And Told Why Ycp Lost In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో వాళ్ళ పార్టీ నేతలు, కార్యకర్తలే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తాడేపల్లి ఆఫీసులో జగన్ చుట్టూ ఉన్న కోటరీయే ఆయన కొంప ముంచిందని డైరెక్ట్ గా సజ్జల, ధనుంజన్ రెడ్డి పేర్లను బయటపెట్టారు. గ్రౌండ్ రియాలిటీని జగన్ కు చెప్పకుండా వాళ్ళే అడ్డుపడ్డారని అన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు, జనంతో కలవకుండా… కోటరీ చెప్పుచేతల్లో ఉండటం వల్లే పార్టీ నాశనమైందని గగ్గోలు పెట్టారు. అయినా జగన్ లో మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. ఆ కోటరీ అడ్వైజర్ల మీద ప్రేమ ఇంకా తగ్గినట్టు లేదు. అందుకేనేమో వైసీపీ పార్లమెంట్ సభ్యుల మీటింగ్ లో… తగుదునమ్మా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చి కూర్చున్నాడు.

వైసీపీ హయాంలో ప్రభుత్వం… పార్టీ… ఏ వ్యవహారమైనా సరే… మీడియాకు చెప్పాలంటే ఒన్ అండ్ ఓన్లీ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని శాఖలకు సంబంధించిన ప్రశ్నలకీ ఆయనే జవాబు చెప్పేవారు. అందుకే ఆయన్ని అప్పట్లో సకల శాఖల మంత్రి అని పిలిచేవారు. అసలు మంత్రులేమో… తమ శాఖల గురించి చెప్పుకోకుండా… పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ని వ్యక్తిగతంగా తిట్టడానికి పరిమితం అయ్యారు.

ఇప్పుడు అధికారం పోయినా… సజ్జల మాత్రం ఇంకా జగన్ దగ్గరే కనిపిస్తున్నాడు. అప్పట్లో జగన్ కంటే సజ్జల లాంటి వాళ్ళ వల్లే వ్యతిరేకత వచ్చిందని విమర్శలు వచ్చినా… ఇంకా ఆయన్నే వెంటేసుకొని తిరుగుతున్నాడు వైసీపీ అధినేత. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించడానికి… వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు జగన్. ఈ మీటింగ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి ముందు వరుసలో కూర్చోవడంపై వైసీపీ లీడర్లు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయన ఎంపీ ఎప్పుడయ్యాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు. సజ్జల వల్లే పార్టీ నాశనం అయిందని తెలిసీ… మళ్ళీ ఆయన్నెందుకు వెంటేసుకొని తిరుగుతున్నారని మండిపడుతున్నారు. మరి ధైర్యం చేసి జగన్ కు చెప్పే నాయకుడు వైసీపీలో ఉన్నాడా … కష్టమే. మళ్ళీ ఇంకో ఎదురు దెబ్బ తగిలేదాకా ఇలాగే ఉంటుందా అని మండిపడుతున్నారు వైసీపీ అభిమానులు.