Y.S.Sharmila: పాలేరు పంచాయితికి.. బెంగళూరులో పరిష్కారం దొరికేనా ?
ఒక్క నియోజకవర్గంపై ముగ్గురు నేతల కన్ను.
ఇప్పుడు తెలంగాణ మొత్తం మాట్లాడుకుంటోంది పాలేరు నియోజకవర్గం గురించే ! ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ అసెంబ్లీ స్థానం చుట్టూ జరుగుతున్న పరిణామాలను.. రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనిస్తోంది. తుమ్మల, షర్మిలతో పాటు.. మాజీ ఎంపీ పొంగులేటి ఈ నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకున్నారు. దీంతో ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కుతుందని మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
2016లో పాలేరు నుంచి 45వేల మెజారిటీతో గెలిచానని.. ఈసారి అదే రిపీట్ అవుతుందని తుమ్మల ధీమాగా కనిపిస్తుంటే.. ఖమ్మంలో తాను ప్రజా ప్రతినిధి.. అందరివాడిని.. అందుకే తననే గెలిపిస్తారనే కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నారు పొంగులేటి. ఇక రాజన్న రాజ్యం తెస్తాను.. తండ్రి ఆశయాలను తిరిగి నెలకొల్పుతాను.. తనను ఆదరించండి అని ముందుకొచ్చారు వైఎస్ షర్మిల. ఈ ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నా.. అందరికీ ఎదురవుతున్న ప్రధాన సమస్య.. తాము ఆశిస్తోన్న నియోజకవర్గం పాలేరు.
ఇక్కడి టికెట్ కోసం ఈ ముగ్గురు చేస్తున్న ప్రయత్నాలు.. ఆ నియోజకవర్గాన్ని రాష్ట్ర కేంద్రబిందువుగా మార్చాయ్. షర్మిల ఢిల్లీకి వెళ్లి మరీ.. సోనియా, రాహుల్‌తో మంతనాలు జరిపితే.. రేవంత్ రెడ్డి వెంటనే తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఇంతకుముందు నెలరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆశావహుడిగా ఉన్న పొంగులేటికి ఈ రెండు సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయ్. తుమ్మలకు టికెట్ ఇవ్వాలని రేవంత్ ఏకంగా బెంగళూరుకు వెళ్లి… డికే శివకుమార్‌ని కలిశారు. డీకే శివకుమార్, వైఎస్ షర్మిల కుటుంబాలు రాజకీయాలకు అతీతంగా స్నేహితులు.
డీకేని ఆమె ఈ మధ్య కాలంలో చాలాసార్లు కలిశారు. పాలేరు టికెట్ కోసం ప్రతిపాదించారు కూడా. ఇలాంటి పరిణామాల మధ్య పాలేరు డిక్లరేషన్ ఇప్పుడు బెంగళూరు టేబుల్ మీదకి చేరింది. ఈ ముగ్గురే కాకుండా ఇంతకు ముందు నుంచి కూడా పాలేరు కాంగ్రెస్ టికెట్‌కు ఎందరో ఆశావహులు ఉన్నారు. దీంతో ఈ పంచాయితీకి బెంగళూరులో అయినా పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.