Ramoji Rao : ఆ ఐదేళ్లు రామోజీ నరకం చూశారు
తెలుగు మీడియా (Telugu Media) లో ఎంతో మంది జర్నలిస్టులకు (Journalist) అక్షరాలు నేర్పిన మీడియా మొఘల్ ఇక లేరు. తన వ్యాపార సామ్రాజ్యంతో ఎన్నో కుంటుంబాలకు జీవితాన్ని ఇచ్చిన రామోజీ రావు తుదిశ్వాస విడిచారు.
తెలుగు మీడియా (Telugu Media) లో ఎంతో మంది జర్నలిస్టులకు (Journalist) అక్షరాలు నేర్పిన మీడియా మొఘల్ ఇక లేరు. తన వ్యాపార సామ్రాజ్యంతో ఎన్నో కుంటుంబాలకు జీవితాన్ని ఇచ్చిన రామోజీ రావు తుదిశ్వాస విడిచారు. తన జీవిత ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములను చూసిన రామోజీ రావుకు గడిచిన ఐదేళ్లు మాత్రం చాలా కఠినంగానే గడిచాయని చెప్పాలి. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న చాలా మందిపై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలోనే రామోజీరావు (Ramoji Rao) కూ ఇబ్బందులు తప్పలేవు. చివరకు మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి సహకారం లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఆఖరి రోజుల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీ రావు జీవితాన్నే మలుపుతిప్పింది. నిజానికి ఇదే సంస్థతో ఆయన జీవితం ప్రారంభించారు. 1962 నుంచి సాఫీగా సాగిన మార్గదర్శికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చిక్కులు మొదలయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్ళారు.
దీంతో జగన్ సర్కార్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుంది. మార్గదర్శిలో జరిగిన అవకతవకలపై విచారణకు సీఐడీని రంగంలోకి దింపింది. చట్టవిరుద్దంగా ఈ చిట్‌ఫండ్ వ్యాపారం జరుగుతోందంటూ రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజా కిరణ్‌పై కేసులు పెట్టారు. దీంతో ఏపీలోని మార్గదర్శి కార్యాలయాలపై దాడులు చేసింది సీఐడీ. ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా లావాదేవీలు జరిగాయనేది దీనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే మార్గదర్శిలో జరిగిన అవకతవకలపై రామోజీరావు, శైలజా కిరణ్ లను కొన్ని రోజుల క్రితం సీఐడీ విచారించింది.
రామోజీరావుతో పాటు ఆయన కోడల్ని కూడా అరెస్ట్ చేస్తారు అని ప్రచారం కూడా జరిగింది. కానీ రాజకీయ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ గ్యాప్‌లోనే ఏపీలో ఎన్నికలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక రామోజీకి మార్గదర్శికి ఎలాంటి సమస్యలు ఉండవు అని అంతా అనుకుంటున్న తరుణంలో రామోజీ రావు ఇలా తుది శ్వాస విడిచారు. ముందు నుంచీ తనకు మిత్రుడిగా ఉన్న చంద్రబాబును సీఎంగా చూడకుండానే కన్నుమూశారు