YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి లైన్ క్లియర్ అయ్యేనా.. కాంగ్రెస్ పెద్దలు ఏమంటున్నారు..?
తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేసే అంశంపై మరో నాలుగు రోజుల్లో స్పష్టత రానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత షర్మిలతో చెప్పినట్లు సమాచారం.
వైఎస్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేసి అరెస్ట్ కూడా అయ్యారు. ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. పాదయాత్రల పేరుతో లెక్కలేనన్ని అడుగులు వేశారు. అయినప్పటికీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కాంగ్రెస్ లో విలీనానికి సిద్దమయ్యారు.
జాప్యంతో విలీనం ఉపసంహరించుకునే ఆలోచన..
ఈ విలీన ప్రక్రియకు కర్ణాటక నుంచి పావులు కదిపిన విషయం అందరికీ తెలిసిందే. డీకే శివ కుమార్ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈమె కాంగ్రెల్లో పార్టీని విలీనం చేసే ప్రక్రియ సులభతరం అయింది. ఇక పార్టీ హై కమాండ్ ను రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి కలిసారు. రాహూల్ గాంధీతో చాలా సార్లు సంప్రదింపులు జరిపారు. సుదీర్ఘ చర్చల నడుమ పార్టీ విలీనానికి కసరత్తు పూర్తైన వాతావరణం గత నెలలో కనపించింది. అయితే చేర్చుకునే ఆచరణ విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో షర్మిల ఒక గీత గీశారు. సెప్టెంబర్ 30లోపు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయకపోతే నేనే సొంతంగా బరిలోకి దిగుతానని ప్రకటించారు.
తొందరపడొద్దన్న కాంగ్రెస్ కీలకనేత..
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కిపడింది. ఈమె నిలబడితే వైఎస్ సెంటిమెంట్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. అదే ఈమెను చేర్చుకుంటే ఆ ఓట్లు తమకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించి ఆమె ను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారాన్ని షర్మిలకు అందించారు. తాజాగా ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత ఒకరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని.. త్వరలో మరోసారి అధిష్టానంతో సంప్రదింపులు ఉంటాయని తెలిపారు. అగ్రనేతలతో సంప్రదింపుల తరువాత ఖచ్చితమైన నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీంతో షర్మిల తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యే సమయం వరకూ వేచి చూస్తున్నారు. కీలక నాయకులు అందించిన సమాచారం మేరకు మరి కొన్ని రోజులు వేచి చూస్తామని ఆ తర్వాతే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుందామని శనివారం పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది.
త్వరలో ఢిల్లీ టూర్..
ఏది ఏమైనా కాంగ్రెస్లో సొంత లీడర్ల సంగతే ఒక పట్టాన తేల్చరు. ఇక షర్మిల అంశాన్ని అంత సులువుగా స్పష్టం చేస్తారా అన్న భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కొందరు సీనియర్ నాయకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే నాలుగు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా షర్మిల మరో సారి ఢిల్లీ టూర్ కి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు జరిగే చర్చల ఆధారంగా ఖచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
T.V.SRIKAR