Rain Alert: ఆగస్ట్ 2న మరో అల్పపీడనం.. ఈసారి ఇంకా మరణమే..
భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయ్. అదేదో పగపట్టినట్లు వానలు కురిపిస్తున్నాడు వరుణుడు. నిన్నటివరకు వర్షాలు లేవని బాధపడిన కళ్లే.. ఇప్పుడు వానలు ఆగిపోతే బాగుండు అని వేడుకుంటున్నాయ్.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ మూల తడిసిపోయింది. ఎక్కడ చూసినా వానలే.. ఎవరిని పలకరించినా కన్నీళ్లే ! వరదలు అంతలా టెన్షన్ పెడుతున్నాయ్ జనాలకు. పూర్తిగా నిండిపోయిన ప్రాజెక్టులు.. నిండుకుండలను తలపిస్తున్నాయ్. ఏపీతో పోలిస్తే.. వర్షాల ప్రభావం తెలంగాణ మీద ఎక్కువ కనిపిస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్‌లో వర్షాలు కురుస్తున్నాయ్. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరింపులతో.. ఏ మూల నుంచి ఏ ప్రమాదం దూసుకువస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు జనాలు.
ఇలాంటి సమయంలో మరో భయంకరమైన వార్త చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్యే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. కుండపోత వర్షాలతో తెలంగాణ వణుకుతోంది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపూర్ ప్రాంతాల్లో ప్రాంతంలో 24గంటల్లో 649.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షాపాతం నమోదయింది. భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండలోను భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో సంవత్సరం మొత్తం పడాల్సిన వర్షం ఒక్కరోజులోనే నమోదైనట్లు వాతావరణ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వానలే భయపెడుతున్నాయంటే.. మళ్లీ అల్పపీడనం అన్న మాటే..జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.