మంకీగేట్ ఎపిసోడ్, క్రికెట్ ను కుదిపేసిన వివాదం
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు భారత్, ఆస్ట్రేలియా ఎప్పుడు తలపడినా ఆ మ్యాచ్ పై ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో క్రేజ్ ఉంది.
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు భారత్, ఆస్ట్రేలియా ఎప్పుడు తలపడినా ఆ మ్యాచ్ పై ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో క్రేజ్ ఉంది. భారత్, ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎప్పుడు తలపడినా అటు స్టేడియాలే కాదు ఇటు భారత్ లో కోట్లాది మంది ఫ్యాన్స్ టీవీ సెట్లకు అతుక్కుపోతుంటారు. ఈ సిరీస్ కు ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఇరు జట్ల ఆటగాళ్ళ మధ్య జరిగే మాటల యుద్ధమే… సాధారణంగా ప్రత్యర్థులపై మానసికంగా పైచేయి సాధించడానికి కంగారూలు స్లెడ్డింగ్ చేస్తుంటారు.. కానీ వారి స్లెడ్జింగ్ కు ధీటుగా బదులిస్తూ కంగారూలుకే కంగారు పుట్టించిన ఘనత మనదే. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అందుకే ఎప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగినా వివాదాలను అభిమానులు గుర్తు చేసుకుంటుంటారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద వివాదం 2008 ఆసీస్ టూర్ సమయంలో జరిగింది. ఆసీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్… తనని హర్భజన్ సింగ్ మంకీ అన్నాడని ఆరోపించాడు. దీనిని భజ్జీ ఖండించాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు పిచ్ లోనే ఉన్న సచిన్ టెండూల్కర్ భజ్జీకి మద్ధతుగా నిలిచాడు. ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. హర్భజన్ కు సపోర్ట్ గా సచిన్ కూడా సాక్ష్యం చెప్పాడు. టీమిండియా మేనేజర్ గా వ్యవహరించిన ఎంవీ శ్రీధర్ సైతం భజ్జీకి అండగా నిలబడడం, ఆసీస్ మీడియా మాత్రం భారత్ ను టార్గెట్ చేసి కథనాలు ప్రచురించడం తీవ్ర వివాదాస్పదమైంది. చివరికి హర్భజన్ సింగ్ మంకీ అంటూ సైమండ్స్‌ని తిట్టాడని భావించిన ఆస్ట్రేలియా, అతనికి 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు మూడు మ్యాచుల నిషేధం విధించింది.
అయితే అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో టీమిండియా కలిసికట్టుగా హర్భజన్ సింగ్‌కి సపోర్టుగా నిలబడి… భజ్జీపై నిషేధం ఎత్తివేయకపోతే, ఆసీస్ టూర్ క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించింది. దీంతో టీమిండియా డిమాండ్‌కి తలొగ్గిన ఆస్ట్రేలియా జట్టు, హర్భజన్ సింగ్‌పై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ వివాదంపై ఆ మ్యాచ్ రిఫరీ మైక్ ప్రోక్టర్ కూడా ఈ వివాదంలో హర్భజన్ సింగ్‌దే తప్పని ఆరోపించాడు. ఆ మ్యాచ్‌లో 122 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా, పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చేతుల్లో 72 పరుగుల తేడాతో ఓడింది. మంకీ గేట్ వివాదం కారణంగానే తాము తీవ్రంగా నిరుత్సాహానికి లోనయ్యామని ఆసీస్ సారథి పాంటింగ్ కామెంట్ చేశాడు. కాగా ఈ మంకీగేట్ ఎపిసోడ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతిపెద్ద వివాదంగా నిలిచిపోయింది.