Lahari Murder Case: లహరి కేసులో వీడిన మిస్టరీ.. నిందితుడు వల్లభ్ కి పోలీసుల కస్టడీ
లహరి, వల్లభ్ కేసులో రోజుకో కొత్త మలుపు తిరగడం గత కొంత కాలంగా చూస్తూ వచ్చాం. అయితే ఈమెది నూటికి నూరుపాళ్ళు హత్యే అని తేల్చారు పోలీసులు. దీనిపై ఇరు కుటుంబ సభ్యులు స్పందించారు. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడారు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన తొలి రోజు నుంచే ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే వల్లభ్ రెడ్డిని నిందితుడిగా పేర్కొన్నట్లు తెలిపారు. వల్లభ్ రెడ్డిని సాక్షాలు తారుమారు చేసి, వాటిని చెరిపేసిన కేసులో అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామనన్నారు. ఈ సందర్బంగా అతనిని విచారించగా తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. లహరి, వల్లభ్ మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయని దీనికారణంగానే అనేక సార్లు ఈమెను చెయ్యి చేసుకుంటూ వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా దాడి చేసే క్రమంలో ఆమె తలకు తీవ్రంగా గాయమై చనిపోయినట్లు నిర్థారించారు. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా ఇదే విషయం వెలుగులోకి వచ్చిందని నారాయణగూడ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ముందు దీనిని అనుమానాస్పద కేసుగా పరిగిణించామని.. పూర్తి స్థాయి విచారణ తరువాత ఇది హత్యే అని ధృవీకరించి కేసును సవరించామన్నారు.
తండ్రి వివరణ
ఇదిలా ఉంటే సొంత కూతురు మృతి పట్ల తండ్రి మరో వాదనను తెరపైకి తీసుకువచ్చారు. తన అల్లుడు చాలా మంచివాడని, భార్యను చాలా బాగా చూసుకునేవాడు అని గతంలో తెలిపారు. తాజాగా తన కుమార్తె మృతి పట్ల ఎక్కడా ఎవరికీ ఫిర్యాదు చేయలేదన్నారు. పోలీసులే తమకు ఇష్టం వచ్చినట్లుగా ఈ కేసును చిత్రీకరించారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన కుమార్తె లహరికి రక్తస్రావం అయిన మాట వాస్తవమే కానీ కొడితే వచ్చింది కాదని వివరించారు. ఆమె ఆరోగ్యరిత్యా జరిగిన మరణమే తప్ప హత్య కాదన్నారు. డాక్టర్లు పోలీసులకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ నా కూతురికి హార్ట్ ఎటాక్ వచ్చి మరణించినట్లు చెప్పారు.
మామ మాటలు ఇలా
ఇదిలా ఉంటే వల్లభ్ తండ్రి తన భావనను వ్యక్తం చేశారు. లహరిని తన సొంత బిడ్డలాగా చూసుకున్నామన్నారు. మాతో ఎప్పుడూ మంచిగానే ఉండేదని తెలిపారు. మా రెండు కుటుంబాలు చాలా బాగా కలిసి మెలిసి ఉన్నాయన్నారు. తమను ఇబ్బందులకు గురిచేయాలనే ఇలాంటి అవాస్తవాలను చిత్రీకరిస్తున్నారు అని చెప్పారు. తమ కుమారుడు వల్లభ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ కేసును రాజకీయంగా మార్చారని భావిస్తున్నట్లు వివరించారు. ఈ విషయంలో మృతురాలి తండ్రి, నిందితుడి తండ్రి ఒకే కార్లో వెళ్లి పోలీస్ కమీషనర్ ను కలవడం పై ఈ కేసు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
T.V.SRIKAR