నయా కింగ్ వచ్చేశాడు, ఆసీస్ గడ్డపై జైశ్వాల్ హవా
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు అక్కడి మీడియా అంతా ఇద్దరి గురించే ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఆసీస్ టూర్ అంటూ ఒకవైపు... అదే సమయంలో కోహ్లీకి రిప్లేస్ మెంట్ గా కొత్త కింగ్ వచ్చేశాడంటూ...
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు అక్కడి మీడియా అంతా ఇద్దరి గురించే ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఆసీస్ టూర్ అంటూ ఒకవైపు… అదే సమయంలో కోహ్లీకి రిప్లేస్ మెంట్ గా కొత్త కింగ్ వచ్చేశాడంటూ యువక్రికెటర్ యశస్వి జైశ్వాల్ గురించి బ్యానర్ కథనాలు ఇచ్చింది. ఆస్ట్రేలియాలోని ప్రధాన పత్రికలన్నీ జైశ్వాల్ గురించే ఫోకస్ ఎందుకు పెట్టాయన్నది తొలి టెస్టుతోనే అందరికీ అర్థమైంది. పెర్త్ లాంటి బౌన్సీ వికెట్ పై తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన జైశ్వాల్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టేశాడు. ఆసీస్ పేసర్లు బౌన్సర్లు, షార్ట్ పిచ్ బాల్స్ తో కవ్వించినా ఓపిక ప్రదర్శించాడు. డిఫెన్స్ ఆడుతూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించడమే కాదు సక్సెస్ కూడా అయ్యాడు.
టెస్టుల్లో ఏ విధంగా ఆడాలో అదే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ పిచ్ లపై సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా పెర్త్ లాంటి పేస్ పిచ్ పై జైశ్వాల్ ఎంతో సహనంతో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 205 బంతుల్లో ఎనిమిది బౌండరీలు, మూడు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అప్పర్ కట్‌తో సిక్సర్ బాది జైస్వాల్ మూడంకెల స్కోరును అందుకోవడం హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలో జైస్వాల్ అరుదైన రికార్డులు బద్దలుకొట్టాడు. 23 ఏళ్ల కంటే తక్కువ వయస్సులో భారత్ తరఫున ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి సరసన జైస్వాల్ సంయుక్తంగా నిలిచాడు. 1984లో రవిశాస్త్రి, 1992లో సచిన్ టెండూల్కర్, 2024లో జైస్వాల్ మూడేసి శతకాలు బాదారు. అగ్రస్థానంలో సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ సంయుక్తంగా ఉన్నారు. 1971లో గవాస్కర్, 1993లో వినోద్ కాంబ్లీ నాలుగు శతకాలు సాధించారు.
23 ఏళ్ల వయస్సులోపు భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన మూడో ప్లేయర్‌గానూ యశస్వీ జైస్వాల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 4 సెంచరీలు బాదిన జైస్వాల్.. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (8), రవిశాస్త్రి (5) ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాలో 2014-15 తర్వాత సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గానూ జైస్వాల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు చివరిగా సిడ్నీ టెస్టులో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ శతకం బాదాడు. అలాగే తమ తొలి ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా జైస్వాల్ ఘనత సాధించాడు. 1967/68లో జయసింహా, 1977/78లో సునీల్ గవాస్కర్ తమ తొలి ఆసీస్ పర్యటనల్లోనే శతకం బాదారు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా జైస్వాల్-కేఎల్ రాహుల్ నిలిచారు.