Haldirams Snacks King : హల్దీరామ్స్ టాటాల పరం కానుందా…?
చిన్నపిల్లలకు కరకరలాడే చిప్స్.. పెద్దలకు సాయంత్రం స్నాక్స్... మందుబాబులకు మంచింగ్.. అందరికీ ఫేవరెట్ బ్రాండ్ హాల్దీరామ్.. ప్రతి దుకాణంలోనూ హల్దీరామ్స్ ఉత్పత్తులు కనిపిస్తాయి. మంచినీళ్లు దొరకవేమో కానీ హాల్దీరామ్స్ ప్రొడక్ట్స్ మాత్రం విస్తృతంగా దొరుకుతాయి.
హల్దీరామ్స్.. స్నాక్స్ కింగ్.. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు టాటాలు రెడీ అయ్యారన్న వార్త ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ధర దగ్గరే పీటముడి పడినట్లు తెలుస్తోంది. హాల్దిరామ్స్ చెబుతున్న రేటు మరీ ఎక్కువగా ఉందన్నది టాటాల మాటగా కనిపిస్తోంది. ఇంతకీ డీల్ సెట్ అవుతుందా…?
హాల్దీరామ్స్… స్నాక్స్ కింగ్
చిన్నపిల్లలకు కరకరలాడే చిప్స్.. పెద్దలకు సాయంత్రం స్నాక్స్.. మందుబాబులకు మంచింగ్.. అందరికీ ఫేవరెట్ బ్రాండ్ హాల్దీరామ్.. ప్రతి దుకాణంలోనూ హల్దీరామ్స్ ఉత్పత్తులు కనిపిస్తాయి. మంచినీళ్లు దొరకవేమో కానీ హాల్దీరామ్స్ ప్రొడక్ట్స్ మాత్రం విస్తృతంగా దొరుకుతాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులు తీసుకొస్తూ ట్రెండ్‌కు తగినట్లుగా మారుతోంది హాల్దీరామ్స్. సింగపూర్, అమెరికాలో కూడా హాల్దిరామ్స్ ఉత్పత్తులు దొరుకుతాయి. 80 దేశాలకు హల్దీరామ్ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. అంతేకాదు దేశంలో 150 రెస్టారెంట్లు కూడా హాల్దీరామ్స్ నడుపుతోంది. 2017లో దేశంలోనే అతిపెద్ద స్నాక్స్ తయారీ సంస్థగా నిలిచింది.
డీల్ కుదురుతుందా..?
ఇప్పుడు హాల్దిరామ్స్‌లో 51శాతం వాటా కొనుగోలు చేయాలని టాటాలు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇరు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే విలువ దగ్గరే పీటముడి పడినట్లు తెలుస్తోంది. హాల్దీరామ్స్ తన కంపెనీ విలువను 10బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే 83వేల కోట్ల కంటే కాస్త ఎక్కువే. ఇందులో 51శాతం అంటే 42వేల కోట్లు టాటాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విలువ విషయంలోనే రెండు సంస్థల మధ్య తేడాలొచ్చినట్లు తెలుస్తోంది. హాల్దీరామ్స్ తన విలువను మరీ ఎక్కువగా లెక్కకట్టిందని టాటా గ్రూప్ అంటోంది. దీనిపై మరోసారి ఆలోచించాలని కోరుతోంది. 10శాతం వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్‌కు విక్రయించేందుకు కూడా హాల్దిరామ్స్ చర్చలు జరుపుతోంది. గతంలో బ్రిటన్‌కు చెందిన కెల్లోస్ కూడా హాల్దిరామ్స్‌లో వాటాల విక్రయానికి ప్రయత్నించింది కానీ అది ఎందుకు కార్యరూపం దాల్చలేదు.
ఎవరికి పోటీ…?
టాటాల ప్రయత్నం ఫలించి హాల్దిరామ్స్‌లో వాటాలు సొంతమైతే మాత్రం భారతీయ రీటైల్ రంగంలో ప్యాకేజ్డ్ ఫుడ్ వార్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. పెప్సీ లేస్ పేరుతో చిప్స్ విక్రయాలు చేస్తోంది. దానికి టాటాల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. రిలయన్స్‌కు కూడా ఈ మార్కెట్ వార్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పటికే పలు బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే ఎక్కువగా టీ ఉత్పత్తులు ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు హాల్దిరామ్స్‌లో వాటాల విక్రయం ద్వారా ఫుడ్‌మార్కెట్‌ను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఓ చిన్న షాపుగా మొదలై..!
దేశీయ స్నాక్ మార్కెట్ విలువ 51,600 కోట్లు. ఇందులో హాల్దిరామ్స్ వాటా ఏకంగా 13శాతం. పెప్సీ కూడా లేస్ ద్వారా మరో 13శాతం వాటాను కలిగి ఉంది. మరే సంస్థ కూడా వీటి దరిదాపుల్లో లేవు. హల్దీరామ్స్ సంవత్సర ఆదాయం దాదాపు 8వేలకోట్లు. స్వీట్స్, స్నాక్స్ ఇలా 400కు పైగా ఉత్పత్తులను ఇది విక్రయిస్తోంది. 1937లో రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఓ చిన్న స్వీట్లు, స్నాక్స్ దుకాణంగా దీన్ని ప్రారంభించారు గంగా బిషన్ అగర్వాల్. ఇది ఇంత విస్తరిస్తుందని అప్పట్లో ఆయన ఊహించలేదు. తర్వాత ఇది నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరించింది. దీన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని భావించిన అగర్వాల్ వంశస్థులు కోల్‌కతాలో 1970లో మొదటి తయారీ ప్లాంటును ప్రారంభించారు. తర్వాత ఢిల్లీలో మరో ప్లాంట్ ఏర్పాటైంది. ఇలా దేశమంతా విస్తరించింది. గత కొన్నేళ్లుగా హాల్దీరామ్స్ శరవేగంతో దూసుకుపోతోంది. ఇప్పుడు టాటాల చేతిలోకి వెళితే ఇంకెంత విస్తరిస్తుందో మరి…!