KAVITHA FINISH : కవిత పని ఫినిష్ ! ఏడాదైనా జైల్లో ఉండక తప్పదు
కవిత (Kavitha) ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం కష్టమే. ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ (CBI) చట్రంలో పూర్తిగా ఆమె ఇరుక్కుపోయినట్టే.
కవిత (Kavitha) ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం కష్టమే. ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ (CBI) చట్రంలో పూర్తిగా ఆమె ఇరుక్కుపోయినట్టే. ఈడీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను అరెస్టు చేసిన సీబీఐ… లిక్కర్ కేసులో కవిత పాత్రపై మరింత తవ్వి తీసింది. రెండు ప్రత్యేక కేసుల్లోనూ ఆమెకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించట్లేదు. కవిత నెలల తరబడి జైలులో ఉండక తప్పదు.
ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో తీహార్ జైలు (Tihar Jail) లో ఉన్న BRS ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో తీహార్ జైలులో ఉండగానే సీబీఐ కవితను అదుపులోకి తీసుకుంది. దీంతో అరెస్టయి కస్టడీలో ఉన్న కవిత… మరోసారి సాంకేతికంగా అరెస్ట్ అయినట్లయ్యింది. సిబిఐ అరెస్ట్ ని మరో ప్రత్యేక కేసుగానే పరిగణిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈనెల 6న తీహార్ జైలులోనే కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్‌లపైనా దర్యాప్తు చేస్తోంది.
సౌత్ గ్రూపునకు ఆప్‌కు మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారనీ… ఆ తరువాత లిక్కర్ ద్వారా 200కోట్ల రూపాయలకు పైగా అక్రమాదాయం సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. IPC 120B కింద కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రకటించింది. కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ తరలించారు. కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు.
సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ చేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. కవితను.. తాజాగా పీటీ వారెంట్ తో సీబీఐ అరెస్టు చేసింది. ఇలా పీటీ వారంట్ పై ఉన్న నిందితులకు.. అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలవుతారు. లేకుంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్, 2G స్కామ్ లో కనిమొళి కూడా ఈడీ, CBI కేసులను ఎదుర్కొని ఏడాదిన్నరకు పైగా జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా… సిబిఐ కేసులోనూ బెయిల్ రావాలి. కవితను మార్చి 15న మొదట ఈడీ అరెస్టు చేసి.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. జ్యుడీషియల్ రిమాండ్ కింద కోర్టు తీహార్ జైలుకు పంపింది.
ఇప్పుడామెను సీబీఐ పీటీ వారంట్ పై అరెస్టు చేయడంతో..సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరుస్తుంది. ఒకవేళ సీబీఐ కస్టడీకి ఇస్తే.. అధికారులు కవితను సీబీఐ ఆఫీసుకు తరలించి ప్రశ్నిస్తారు. కవితకు ఈడీ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చినా…. సీబీఐ అరెస్టు వల్ల మళ్ళీ జైల్లోనే ఉండాలి. సీబీఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటికొస్తారు.
అటు ఈడీ,ఇటు సీబీఐ అరెస్టులతో కవిత చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఆమె ఇప్పట్లో బయటకొచ్చే అవకాశాల్లేవు. రెండు కేసుల్లోనూ బెయిల్ వస్తేనే.. ఆమె బయటకు వస్తుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. ఇదే లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్నోనెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈడీ, సీబీఐ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఏం కోరుకుంటాయో అలాగే న్యాయస్థానాలు కూడా సహకరిస్తుంటాయని లీగల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కోర్టులు ఎప్పుడు విచారణ విషయంలో జోక్యం చేసుకోబోవంటున్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు పక్కదారి పడితే మాత్రం… కోర్టులు జోక్యం చేసుకుంటాయని అంటున్నారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఎవరికైనా బెయిల్ వస్తుందన్నారు. మొత్తానికి లిక్కర్ కేసులో కవిత ఇంకొన్ని రోజులు జైల్లోనే ఉండక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఏడాదా… రెండేళ్ళా అనేది కోర్టులు నిర్ణయించాల్సిందే.