కాంగ్రెస్ Vs బీజేపీ.. సెప్టెంబరు 17 ‘పరేడ్’ వార్.. నెగ్గేదెవరు ?

తెలంగాణలో సభలు, సమావేశాల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 07:31 AMLast Updated on: Sep 06, 2023 | 7:31 AM

The Politics Of Bjp And Congress Is Taking Place At The Parade Ground

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సెప్టెంబరు 17 చుట్టూ తిరుగుతున్నాయి. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అని బీజేపీ అంటుంటే.. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవమని కాంగ్రెస్ అంటోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇప్పుడు ఈ ఉత్సవ సభలను జరుపుకునే విషయంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. దీనిపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి. గతేడాది సికింద్రాబాద్ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన బీజేపీ ఈసారి కూడా అక్కడే ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తామని అంటోంది. ఈవిషయాన్ని స్వయంగా బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు సెప్టెంబరు 17న సాయంత్రం 4 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లోనే 10లక్షల మందితో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఆ సభలో సోనియా గాంధీ కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రకటించనున్నారు.

ముందే అప్లై చేశామంటున్న కాంగ్రెస్..

కీలకమైన ఈ సభ కోసం సెప్టెంబర్ 2నే తాము రక్షణ శాఖకు దరఖాస్తు చేశామని హస్తం పార్టీ అంటోంది. తాము అప్లై చేసిన తర్వాతే బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు కలిసి కుట్రపూరితంగా పరేడ్ గ్రౌండ్ సభకు అనుమతిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లోనే సభ పెడతామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమని అంటోంది. ఎస్పీజీ భద్రత కలిగిన నేతలు మీటింగ్ కు వస్తున్నప్పుడు విజ్ఞతతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ కోరుతోంది. ఒకవేళ పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ నిర్వహణకు నో చెబితే.. రెండో ఆప్షన్‌గా ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడించింది. ఒకవేళ సభకు అనుమతి ఇవ్వకున్నా కార్యక్రమాన్ని వాయిదా వేసేది లేదని హస్తం పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో ఇరుపార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి.

ఈసారి పరేడ్ గ్రౌండ్స్ లో కాదు.. వరంగల్ లో..

వాస్తవానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కాంగ్రెస్ సభకు ఇంక ఆటంకమేమీ ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వరంగల్ వేదికగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓరుగల్లులో జరిగే బహిరంగ సభకు స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈసందర్భంగా కేంద్ర భద్రతా దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర భద్రతా బలగాల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా సెప్టెంబర్ 17న కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేస్తోంది. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో తమ బల ప్రదర్శనకు, క్యాడర్ ను యాక్టివేట్ చేసుకునేందుకు ఈ ప్రోగ్రామ్ ను ఒక మాధ్యమంగా వాడుకోవాలని పార్టీలు యోచిస్తున్నాయి.