Kokapet Land: కోకాపేటలో ఎకరా 100 కోట్లు.. భూములు కావవి.. ఖజానా నింపే అక్షయపాత్రలు..!
ఎన్నికల వేళ నిధుల కొరతతో కొత్త అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్న కేసీఆర్ సర్కార్‌కు కోకాపేట భూముల రూపంలో ఊహించని అభయ హస్తం దొరికింది.
రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో లేని విధంగా కోకాపేట భూములు ఆల్ టైమ్ హైతో రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. HMDA నిర్వహించిన సెకండ్ ఫేజ్ ఈ ఆక్షన్ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టింది. గతంలో HMDA అమ్మిన అన్ని భూములతో పోల్చితే ప్రస్తుతం కోకాపేటలోని నియోపోలిస్ లే అవుట్ లో అమ్ముడుపోయిన భూములు హాట్ కేక్‌లు మారాయి.
నియోపాలిస్‌లో ఎన్ని ఎకరాలు ?
నియోపోలిస్ లే అవుట్ లోని..ప్లాట్ నెంబర్ 6 నుంచి 11 వరకు అలాగే ప్లాట్ నెంబర్ 14 మొత్తం.. 45.33 ఎకరాలకు హెచ్ ఎం డీ ఏ వేలం నిర్వహించింది. ఈ భూములను సొంతం చేసుకునేందుకు బడా వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫార్మా కంపెనీలు పోటీపడ్డాయి. ఏపీఆర్ – రాజపుష్ప కంపెనీలు.. ప్లాట్ నెంబర్ 10లో ఎకరానికి 100 కోట్లకు పైగా చెల్లించేందుకు సిద్ధమయ్యారంటే.. కోకాపేట భూములకున్న విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
కోకాపేట భూములకు ఎందుకంత డిమాండ్ ?
హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ సిటీగా మారిపోయింది. ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ భాగ్యనగరంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇన్వెస్టమెంట్, జాబ్ క్రియేషన్, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్ ఫేవరెట్ సిటీగా మారడంతో..భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ప్రభుత్వం కూడా కనీవినీ ఎరుగని సదుపాయాలతో అద్భుతమైన లే అవుట్లను డిజైన్ చేసి అమ్మకాని పెడుతోంది. అందులో భాగంగానే కోకాపేటలో నియోపోలిస్ పేరుతో లే అవుట్లను సిద్ధం చేసింది. 2021లో మొదటి విడతలో 49.949 ఎకరాలను అమ్మకానికి పెడితే..హెచ్ ఎం డీ ఏ కు 2 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నీయోపోలీస్ సెకండ్ ఫేజ్ వేలం ఇప్పుడు దాన్ని బీట్ చేసింది.
నియోపోలీస్ లే అవుట్ చాలా స్పెషల్
కోకాపేటలోని నియోపోలీస్ లే అవుట్ ఉన్న ఏరియాకు వెళ్తే.. హైదరాబాద్ లో ఉన్నామా లేక.. హాంకాంగ్, న్యూయార్క్ సిటీలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మౌలిక సదుపాయాల విషయంలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. కేవలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసమే ప్రభుత్వం 350 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ధగధగా మెరిసిపోయే రోడ్లు… స్ట్రీట్ లైట్లు, పార్కులు, ఒక్కటేంటి.. నియోపోలీస్ లే అవుట్ నభూతో న భవిష్యతి అన్నట్టు ఉంటుంది. అందుకే ఆ భూములను దక్కించుకునేందుకు బడావ్యాపారులు క్యూ కడుతూ ఉంటారు. బిజినెస్, రెసిడెన్షియల్ వెంచర్‌కు ఇక్కడ మరే ప్రాంతంలో లేనంత డిమాండ్ ఉంది. అందుకే కోకాపేట భూములు కేకపుట్టిస్తున్నాయి.. హై క్వాలిటీ హౌసింగ్, కమర్షియల్ బిల్డింగ్స్, షాపింగ్ సెంటర్స్ ఇలా వరల్డ్ క్లాస్ సిటీని తలపించే నిర్మాణాలు భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నాయి.
భూములు అమ్మాలి.. ఖజానా నింపుకోవాలి
ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మంచి ఆప్షన్.. హైదరాబాద్ చుట్టు పక్కల భూములను వేలం వేయడం. భౌగోళికంగా హైదరాబాద్ నగరానికున్న ప్రాధాన్యత.. వరల్డ్ క్లాస్ సిటీగా ఎదుగుతున్న తీరు కారణంగా.. ప్రభుత్వ భూమి ఎక్కడున్నా.. అది హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను వచ్చే వందేళ్ల కాలాన్ని ఊహించి ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టే.. సిటీ రూపురేఖలను మార్చేస్తుంది. విలువైన భూములు కార్పోరేట్ చేతుల్లోకి వెళితే.. ఇక ప్రాంతానికి రెక్కలెచ్చినట్టే.. ఓవైపు అభివృద్ధి కనిపిస్తుంది..మరోవైపు ఖజానా కూడా నిండుతుంది.. అందుకే కోకాపేట భూములు తెలంగాణ ప్రభుత్వానికి అక్షయపాత్రగా మారాయి.