తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు

తెలంగాణలో త్వరలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలున్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుందనే దానిపై గ్రౌండ్‌లెవల్‌లో అధ్యయనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పని దాదాపు పూర్తి చేసిన అధికారులు ఆగస్ట్ 17న సీఎంకు రిపోర్ట్ కూడా ఇవ్వనున్నారు. ఈ రిపోర్ట్ అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణలో ప్రస్తుతం స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తున్న భూముల మార్కెట్ ధరలకు, వాస్తవంగా బహిరంగ మార్కెట్‌లో ధరలకు మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయి అధికారులు అధ్యయనం చేశారు. ప్రభుత్వ ఆదాయాలు పెంచుకునే మార్గాలపై ఇటీవల సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. భూముల మార్కెట్ విలువలపై ఉన్నతాధికారులతో అంతర్గతంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న వాస్తవ ధరలకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనే అంశాన్ని అధికారులు సీఎం దృష్టికితీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే భూముల ధరల సవరణ చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ భూముల సవరణ మార్గదర్శకాలు-1998లోని నిబంధనలకు అనుగుణంగా.. సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన విధంగా కొత్త విలువలను ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా, మండల స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ నేతృత్వంలో ఈ కమిటీలు సాగు, సాగేతర భూముల విలువలపై తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయనున్నాయి. అధికారులు ఇచ్చే రిపోర్ట్‌ను భట్టి వ్యవసాయ భూములు, ఖాలీ స్థలాల రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి. ఇక ప్లాట్ల రేట్లు కూడా 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఈ నెలాఖరులోగా అధికారిక ప్రకటన విడుదల చేయబోతోంది ప్రభుత్వం.