BJP: బీజేపీలో టికెట్ కోసం భారీ ఫైట్.. అభ్యర్థుల ప్రకటన ఆరోజే..
తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ నెలకొంది.

The process of applications for MLA candidates in Telangana BJP has started
తెలంగాణలో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. రాష్ట్రంలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయ్. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయ్. ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తును ముమ్మరం చేశాయ్. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసేందుకు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ, కాంగ్రెస్ దాదాపు ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నాయ్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించాయ్.
119 స్థానాలకు కాంగ్రెస్‌లో వెయ్యికి పైగా అప్లికేషన్స్ వస్తే.. బీజేపీలోనూ అదే జోష్ కనిపించింది. 119 స్థానాలకు దాదాపు 999 అప్లికేషన్స్ వచ్చాయ్. ఐతే ఒక్కో వ్యక్తి నాలుగు, ఐదు స్థానాలకు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. బీజేసీ ముఖ్యనేతలు, సీనియర్ల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నాలుగో రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్య నేతలు ఎవరూ అప్లికేషన్ చేసుకోలేదు. దరఖాస్తు సిస్టమ్‌ను బీజేపీ సీనియర్ నాయకులు అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకిలా అని అడిగితే.. మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నామని వారు దగ్గర నుంచి సమాధానాలు వస్తున్నాయ్. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి వస్తున్న దరఖాస్తులపై బీజేపీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాశ్ జవదేకర్ ఆరా తీశారు. ముఖ్య నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఎంత పెద్ద నాయకుడు అయినా టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. దరఖాస్తు చేసుకోకపోతే టికెట్ ఇవ్వరా అంటూ సీనియర్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక అటు ఈనెల 10వ వరకు బీజేపీలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేయనుంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ నెల 17 తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉంది.