Mumbai: మనుషులకు ఆధార్ ఎలాగో.. కుక్క మెడలో క్యూఆర్ ట్యాగ్ అలాగ
ఆధార్ కార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్లో ఏమి కావాలన్ని ఆధార్ తప్పని సరి అయిపోయింది. సుప్రీం కోర్డ్ దీనిపై స్పందించి ఆధార్ అన్నింటికీ అవసరం లేదని తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ఈ విషయాన్ని బేకాతరు చేస్తూ ఆధార్ ధృవీకరణ పత్రాన్ని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ఇదంతా సమాజంలో నివసించే మనుషుల గురించిన అంశం. అయితే వీధి కుక్కలకు కూడా ఆధార్ తరహా గుర్తింపుకు శ్రీకారం చుట్టింది ఒక సంస్థ. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మన దేశంలో వందల నగరాలు అభివృద్ది చెందుతున్నాయి. అవి ఎంత డెవలప్ అయినప్పటికీ వీధి కుక్కల బారినుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలు కనబడటం లేదు. ఎక్కడైనా ఒక శునకం జనాలకు ఇబ్బంది కలుగజేస్తే ఆ కాలనీలోని వాసులు మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటే ఆప్పుడు వాటిని తీసుకెళ్లేందుకు తూతూ మంత్రంగా వచ్చి దొరికినవాటిని తీసుకొని వెళ్తారు. ఇప్పటి కాలం కుక్కలు మనకంటే చాలా హుషారుగా మరిపోయాయి. ఇలా ఎవరైనా సిబ్బంది వచ్చారంటే వారికి కనిపించకుండా దాక్కుంటున్నాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వెళ్లిన తరువాత రెండు రోజులకు మళ్లీ వీధి శునకాలు రోడ్లపై స్వైర్య విహారం చేస్తాయి. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు యువకులు సరికొత్త ప్రయోగానికి ఆజ్యంపోశారు. అదే కుక్కల మెడలో ఆధార్ తరహా క్యూఆర్ కోడ్ ట్యాగ్ తగిలించడం.
ఈ కార్యక్రమం ముంబాయ్ నగరంలో చేపట్టారు. సమాజంలో నివసించే పౌరుల సమాచారం లాగా కుక్కలకు కూడా ఒక కార్డును రూపొందించారు. ఇందులో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆ కుక్క ఏ ప్రాంతానికి చెందింది. దీనికి ఆహారం పెట్టే వాళ్లు ఎవరు. వ్యాక్సిన్లు సమయానికి వేయిస్తున్నారా లేదా. స్టెరిలైజేషన్ స్టేటస్ ఏంటి.. ఆ శునకం ఆరోగ్య పరిస్థితి ఏలా ఉంది. ఇలా అన్నింటినీ కలిపి ఒక డేటాబేస్ డొమైన్ ను ఏర్పాటు చేశారు. ముంబాయి ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండే జనావాసాలను కేంద్రంగా చేసుకొని మొదటగా దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇది విజయవంతం అయితే నగరం మొత్తం విస్తరించే యోచన చేస్తున్నారు. ఆతరువాత రాష్ట్రమంతటా ఈ క్యూఆర్ కోడ్ ట్యాగ్ ను శునకాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు.
ఈ విధానాన్ని ముంబాయ్ నగరంలోని సాయన్ ప్రాంతానికి చెందిన అక్షయ్ రిడ్లాన్ అనే యువకుడు రూపొందించారు. ఇతను ఇంజనీరింగ్ పూర్తిచేశారు. వీధి కుక్కల కోసం సరైన డేటా బేస్ ఉండాలని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వివరించారు. వీరు దీనికి సుముఖత వ్యక్తం చేసి ఈ యువకుడికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ ట్యాగ్ ల వల్ల ఏవ్యక్తి అయినా తన పై దాడి చేసినా, కాలనీల్లో ఇబ్బందికి గురిచేసినా వెంటనే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించడం వల్ల ఆ శునకం ఏ ప్రాంతానికి చెందినదో అంచనా వేసి దానిని తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది.
T.V.SRIKAR