Vikram Lander: సెంచరీ కొట్టిన ప్రగ్యాన్ రోవర్..15వ రోజు రోవర్ పనేంటి..?
వంద మీటర్ల ప్రయాణాన్ని సునాయాసంగా సాగించిన రోవర్ ప్రజ్ఞాన్.
చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినప్పటి నుంచి తన పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్ 3 రోవర్ ప్రజ్ఞాన్.. ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఇప్పటివరకు చంద్రునిపై ఇది వంద మీటర్ల వరకు ప్రయాణం చేసింది. తన అన్వేషణల్లో భాగంగా ఇంకా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ట్విటర్‌లో తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్ 100 నాటౌట్. చంద్రుని ఈ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్లు ప్రయాణించింది, ఇంకా ప్రయాణం కొనసాగిస్తోంది అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఇస్రో పోస్ట్ చేసింది. ఆగస్టు 23వ తేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా దేశాలే ఈ ఘనతను సాధించాయి. దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు ల్యాండ్ అయిన వెంటనే తమ పనిని మొదలుపెట్టాయి. రోవర్ చంద్రుడి మీద అడుగు పెట్టిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ఆ శివశక్తి పాయింట్ నుంచి 100మీటర్లకు పైగా ప్రయాణించిందని, ఇంకా ప్రయాణాన్ని కొనసాగిస్తోందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత, వివిధ మూలకాల సమాచారం, చంద్రుడిపై ప్రకంపనల వంటి సమాచారాన్ని ప్రజ్ఞాన్ రోవర్ చేరవేసింది. అంతేకాదు.. సల్ఫర్, ఆక్సిజన్, ఇనుము, క్రోమియం, సిలికాన్ వంటి మూలకాల ఉనికిని కూడా చంద్రయాన్ 3 కనిపెట్టింది.
ప్రస్తుతం హైడ్రోజన్, హీలియం నిల్వల వేట సాగుతోంది. చంద్రుడిపై ఒక్క పగలు అంటే మనకు 14 రోజులు. దీంతో ఒక్క పగలు సమయం గడుస్తున్న తరుణంలో ఇస్రో అలర్ట్ అయింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకునేందుకు వీలుగా రోవర్, ల్యాండర్‌ను స్లీపింగ్ మోడ్‌లోకి పంపించే ప్రక్రియ మొదలుపెట్టబోతోంది. రోవర్, ల్యాండర్‌లను నిద్రపుచ్చే ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. చంద్రుని మీద రోవర్, ల్యాండర్ రాత్రిని తట్టుకోవలసి ఉంటుంది. నిజానికి ల్యాండర్, రోవర్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉన్నాయి చంద్రునిపై రాత్రివేళ మైనస్ 2వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ చలిని తట్టుకోవాలంటే, వీటిని స్లీపింగ్ మోడ్‌లోకి పంపించడమే బెస్ట్ మార్గం.